వాస్తవానికి బాలీవుడ్, కోలీవుడ్‌లతో పోలిస్తే టాలీవుడ్‌లో మన దర్శకులకు ఉన్న స్వేచ్చ నామమాత్రమే అని ఒప్పుకోకతప్పదు. పేరుకు ఒక డైరెక్టర్‌ను పెట్టుకొని అన్ని విషయాలలోనూ మన స్టార్ హీరోలు వేలుపెడుతుంటారు. దానికి ఉదాహరణలుగా ఇటీవల వచ్చిన 'సర్దార్‌గబ్బర్‌సింగ్, సరైనోడు' చెప్పుకోవచ్చు. అయితే ఆ డైరెక్టర్ పేరు వేసిన చిత్రం సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తం మన స్టార్ హీరోలు తమ ఖాతాలో వేసుకుంటారు. సినిమా ఫ్లాపయితే మాత్రం ఆ నింద దర్శకులు మోయాల్సివస్తోంది. ఈ విషయంలో కూడా మన హీరోల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. మంచు విష్ణు మాత్రం మొత్తం బాధ్యత దర్శకుడిదే అని, డైరెక్టర్ చేతిలో తాము కేవలం ఆటబొమ్మలం మాత్రమే అంటున్నాడు. ఒక సినిమాను దర్శకుడు టాలెంట్ ఉంటే ఎక్కడికో తీసుకెళ్లగలడని, అదే ఓ పెద్ద హిట్ కథను కూడా దర్శకుడు పరమ వీక్‌గా తీయడం అనేక సందర్బాల్లో రుజువైందని విష్ణు సెలవిస్తున్నాడు. కానీ మహేష్‌బాబు, బన్నీ వంటి వారి వాదన మరోలా ఉంది. చిత్ర జయాపజయాలకు దర్శకుడికి ఎంత బాధ్యత ఉందో.. హీరోలకు కూడా అంతే బాధ్యత ఉందని మహేష్, బన్నీల అభిప్రాయం. డైరెక్టర్ తయారుచేసిన స్క్రిప్ట్‌ను తాము చదివిన తర్వాతే సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తామని, అదే సినిమా ఫ్లాప్ అయితే ఆ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తమది కూడా బాధ్యతేనని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తాజాగా ఎన్టీఆర్ ప్రస్తావనను కూడా చర్చకు తెస్తున్నారు కొందరు. వాస్తవానికి 'శ్రీమంతుడు' చిత్రం తర్వాత కొరటాల శివకు, మైత్రి మూవీస్ సంస్థకు కొందరు బయ్యర్లు ఏర్పడ్డారు. వీరి కాంబినేషన్‌లోనే వస్తున్న చిత్రం కావడంతో 'జనతాగ్యారేజ్' పంపిణీ హక్కులను కూడా తమకే ఇస్తారని 'శ్రీమంతుడు' బయ్యర్లు ఆశపడుతున్నారు. దానికి దర్శకుడు కొరటాల శివతో పాటు మైత్రి మూవీస్ అధినేతలు కూడా సుముఖంగానే ఉన్నారు. దర్శకుల విషయంలో కూడా వేలుపేట్టే ఎన్టీఆర్ చివరకు బయ్యర్ల విషయంలో, బిజినెస్ వ్యవహారాల్లో కూడా తలదూర్చాడని సమాచారం. పాత డిస్ట్రిబ్యూటర్లను కాదని, తాను చెప్పిన వారికే ఈ చిత్రం పంపిణీ హక్కులు ఇవ్వాలని ఎన్టీఆర్ పట్టుపట్టడంతో ఏమీ చేయలేని పరిస్థితి దర్శకనిర్మాతలు ఉన్నారని సమాచారం. ఇక దర్శకుల విషయానికి వస్తే తాము అనుకున్న సబ్జెక్ట్‌ను అనుకున్న విధంగా స్వేచ్చగా తెరకెక్కించే దర్శకులు ఈ తరంలో మనకు ముగ్గురు నలుగురు తప్ప లేరని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. అలాంటి వారిలో రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్‌ల పేర్లు మాత్రమే ఉండటం గమనార్హం.