సినిమాల్లో రజనీ స్టైల్, రాజకీయాల్లో కేసీఆర్ స్టైల్ ఢిపరెంట్ గా ఉంటాయి. కేసీఆర్ కు సన్నిహితులంటూ శాశ్వతంగా ఎవరూ ఉండరు. సమయానుకూలంగా మారుతుంటారు. ఉద్యమకాలంలో ఉన్నవారెవరూ ఇప్పుడు లేరు. అప్పట్లో కేసీఆర్ ను దూషించినవారు ఇప్పుడు తెరాసలో ఉన్నారు. ఇది ఆయన స్టైల్.
తాజాగా మంత్రుల శాఖల్లో కొన్ని మార్పులు చేశారు కేసీఆర్. ఇప్పటికీ సాంకేతికంగా తెదేపా సభ్యునిగానే ఉన్న తలసాని ప్రాధాన్యత తగ్గించారు. సిటీలో బలమైన నాయకుడు కావాలంటూ చేర్చుకున్న తలసాని పార్టీకి, ముఖ్యంగా జిహెచ్ ఎంసి ఎన్నికల్లో ఏ మాత్రం ఉపయోగపడలేదు. మొత్తం కేటీఆర్ చూసుకున్నారు. కొన్ని సెటిల్ మెంట్ల వ్యవహారంలో తలసాని కుమారుల పేర్లు తరచుగా వినిపించేవి. అలాగే సినీరంగాన్ని చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రి గంట శ్రీనివాసరావు వైజాగ్ తరలించేందుకు వ్యూహాలు రచిస్తుంటే తలసాని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మిగతా మంత్రులెవరికీ లేని విధంగా తలసాని వ్యక్తిగత సెక్యురిటీ పెంచుకున్నాడు. ఆయన ఎక్కడికైనా వెళితే సిఎం, హోం మంత్రులకు లేని హడావుడి కనిపిస్తోంది. వీటితో పాటుగా మంత్రిగా పనితీరు పూర్తిస్థాయి సంతృప్తిగా లేదని కేసీఆర్ అసంతృప్తి చెందినట్టు సమాచారం. ఈ కారణాల వల్ల ముఖ్యమైన వాణిజ్య పన్నుల శాఖను తప్పించి, పశుసంవర్థక శాఖ వంటి అప్రధాన శాఖను ఇచ్చారు. సినిమాటోగ్రఫి అలాగే ఉంది.
ఈ పరిణాల పట్ల తలసాని వర్గం అసంతృప్తిగా ఉన్నప్పటికీ చేయగలిగిందేమీ లేదు. మంత్రి పదవి హామీతోనే తెదేపా నుండి జంప్ అయ్యాడు కాబట్టి దాన్ని కాపాడుకుంటే చాలు.