ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుల సమీకరణాలు ప్రభావితం చేసిన సందర్బాలు గతంలో పెద్దగా లేవు. కానీ 2014 ఎన్నికల నుండే చరిత్ర మారింది. విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కులం ముద్ర స్పష్టంగా కనిపించింది. రెడ్డి, కమ్మ, కాపు.. ఈ మూడు కులాలలో ఏ రెండు కులాలయితే కలుస్తాయో.. వారివైపే గెలుపుంటుంది. 2014 ఎన్నికల్లో జరిగిందదే...! రాజకీయ చరిత్రలో ఏనాడు కలవని కాపు, కమ్మ వర్గాలు ఆ ఎన్నికల్లో కలిశాయి. కాపులు తెలుగుదేశం వైపు మొగ్గు చూపడంలో సినీ హీరో పవన్‌కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. చంద్రబాబు రాజకీయ మేధావి,అనుభవజ్ఞుడు. కాబట్టే ముందుగా పవన్‌కళ్యాణ్‌ను పట్టుకొని కాపులకు ఒక ఉపముఖ్యమంత్రి పదవి అని ఎరవేసి వారి ఓట్లను కొల్లగొట్టగలిగాడు. జగన్‌కు రాజకీయంగా అన్ని తెలివితేటలు లేవు. అదీగాక అనుభవ రాహిత్యం ఒకటి. అలాగే నేను అధికారంలోకి వస్తానన్న ధీమా కొంచెం ఎవ్కువైంది. ఇక్కడే అతను దెబ్బతిన్నాడు. గతాన్ని వదిలిపెడితే రేపు జరగబోయేదేంటన్నది ప్రశ్న..?
2019 ఎన్నికల్లో తాను క్రియాశీలకంగా వ్యవహరిస్తానని పవన్‌కళ్యాణ్ ప్రకటించాడు. ఏ విధంగా తన రాజకీయ పయనముంటుందనే దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయనకు తెలుగుదేశం, బిజెపిలతో మైత్రి ఉంది. రాష్ట్ర రాజకీయాల పరంగా ఆయన తెలుగుదేశంతోనే కొనసాగితే, కాపులు ఈసారి ఆయనకు కూడా దూరమయ్యే అవకాశముంది. కాపులు ఇప్పటికే తెలుగుదేశంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కాపు రిజర్వేషన్‌ల ఉద్యమంతోపాటు వంగవీటి రంగా విగ్రహాలను ధ్యంసం వంటివి కాపుల్లో కలత రేపాయి. ఇటీవల కాలంలో కాపులను జగన్ బాగానే దువ్వుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని రెచ్చగొట్టడంలో వైకాపా పాత్రను విస్మరించలేం. అంతేకాకుండా కృష్ణ,తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు నాయకులకు దివంగత నేత వైయస్ రాజశేఖర్‌రెడ్డితో సత్సంబంధాలు ఉండేవి. కానీ జగన్ ఆ సంబంధాలను నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మూడు జిల్లాల్లో కాపులను రాబట్టుకోగలిగితే ఇక్కడ జగన్‌కు తిరుగుండదు. అయితే ఇక్కడ అసలు మెలిక పవన్‌కళ్యాణ్‌తోనే...!
పవన్ జగన్‌తో కలిస్తే వైకాపాకు తిరుగుండదు. కాపులు, రెడ్లతోపాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు జమపడతాయి. అలాకాకుండా పవన్ తెలుగుదేశంతో విడిపోయి సొంతంగా పోటీ చేస్తే రాష్ట్ర రాజకీయాలు మూడుముక్కలాటగా మారుతాయి. రెడ్లు, కాపు, కమ్మ.. మూడు పార్టీల మద్య ఓట్లు చీలుతాయి. ఈ విధమైన పోటీ ఏర్పడితే మళ్లీ చంద్రబాబే ప్రయోజనం పొందుతాడు. అలా కాకుండా పవన్, చంద్రబాబుతోనే కొనసాగితే జగన్‌కు లాభమే. ఎందుకంటే చంద్రబాబుతో ఉంటే ఈసారి పవన్‌ను కాపులు నమ్మరు. కాబట్టి వాళ్లు జగన్ వైపు మొగ్గు చూపొచ్చు. అలాకాకుండా పవన్, జగన్ కలిస్తే ఆ కాంబినేషన్ పెద్ద హిట్టయ్యే అవకాశం ఉంది. ఇవేమీ లేకుండా పవన్ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం జగన్ నెత్తిన యాసిడ్.. బాబు నెత్తిన బూస్ట్ పోసినట్లే...!