మెగా మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసి తన మొదటి చిత్రం 'రేయ్' చిత్రం ఆగిపోయి ఎట్టకేలకు 'పిల్లా నువ్వులేని జీవితం' తో ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో సాయిధరమ్‌తేజ్. ఆయనను చూసిన వారు ఇతన్నేం హీరో... కేవలం మెగామేనల్లుడు కావడం తప్ప ఆయనలో హీరోకు కావాల్సిన అసలైన అర్హతలు ఏమీ లేవనే విమర్శలు వచ్చాయి. 'పిల్లా నువ్వులేని జీవితం' బాగానే ఆడినా అది కేవలం గాలివాటంగా వచ్చిన విజయంగా అందరూ భావించారు. ఆ వెంటనే వచ్చిన మొదటి చిత్రం 'రేయ్' డిజాస్టర్ కావడంతో విమర్శలు మరింత పెరిగాయి. ఆ తర్వాత 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రంతో మార్కెట్ రేంజ్ 19కోట్ల వరకు చేరుకున్నప్పటికీ కేవలం తన మేనమామలను అనుకరించడం తప్ప ఆయనలో సరుకులేదన్నారు. తాజాగా ఆయన నటించిన 'సుప్రీమ్' చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ చూసిన తర్వాత ఈ విమర్శకులలో చలనం మొదలైంది. కేవలం 15కోట్లలో తీసిన ఈ చిత్రం ఓవర్‌సీస్‌తో కలిపి 23కోట్ల బిజినెస్ చేసింది. సాయిధరమ్‌తేజ్ చిత్రం కావడం, దిల్‌రాజు నిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం కావడం, 'పటాస్' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత దర్శకుడు అనిల్‌రావిపూడి డైరెక్ట్ చేస్తున్న చిత్రం కావడం, మెగాస్టార్ పాట రీమేక్, డ్యాన్స్‌లలో సాయికి ఉన్న స్పెషల్ క్రేజ్, ఇలాంటి ఎన్నో అంశాలు 'సుప్రీమ్' బిజినెస్ రేంజ్‌ను పెంచాయి. ఇంకా శాటిలైట్ రైట్స్‌ను కూడా లెక్కేసుకుంటే దిల్‌రాజుకు ఈ చిత్రం విడుదలకు ముందే 10కోట్లు వరకు లాభం వచ్చింది. ఇప్పటికే సాయి తన మార్కెట్ రేంజ్‌లో మరో మెగా హీరో వరుణ్‌తేజ్, శర్వానంద్, అల్లరినరేష్ వంటి వారిని ఎప్పుడో మించిపోయాడు. తాజాగా 'సుప్రీమ్' బిజినెస్‌తో ఆయన రేంజ్ రవితేజ, గోపీచంద్, నానిలను క్రాస్ చేసింది. మొత్తానికి భవిష్యత్తులో సుప్రీంస్టార్‌గా మాస్‌లో సాయి ఓ రేంజ్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.