రాజకీయాల్లోనే కాదు.. సినిమా రంగంలో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని మరోసారి నిరూపితం అయింది. ఆమధ్య ఓ చిత్రం విషయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు, వర్మకు మద్య విభేదాలు వచ్చాయి. అసలు వర్మ కెమెరా ఎక్కడ పెడుతున్నాడో కూడా అర్దం కావడం లేదని, వర్మతో ఇక చిత్రాలు చేయనని అమితాబ్ పత్రికాముఖంగా ప్రకటించాడు. కానీ ఇప్పుడు మరలా వర్మ బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యాడో లేదో అమితాబ్‌కు ఓ స్టోరీ చెప్పి ఆయన్ను ఒప్పించాడు. కాగా ఇటీవల అమితాబ్ స్వయంగా ముంబైలోని వర్మ ఆఫీస్‌కు వెళ్లడంతో ఆశ్చర్యపోవడం బాలీవుడ్ వంతు అయింది. కాగా ఇప్పటివరకు అమితాబ్‌తో వర్మ చాలా చిత్రాలు చేశాడు. 'రన్, ఆగ్, డిపార్ట్‌మెంట్, డర్నా జరూరీ హై, నిశ్శబ్ద్, సర్కార్, సర్కార్‌రాజ్' లు తీశాడు. ఇందులో 'సర్కార్, దాని సీక్వెల్ సర్కార్‌రాజ్' లు మంచి విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలలోనూ అమితాబ్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా కలిసి నటించాడు. తాజాగా 'సర్కార్3' కి సంబంధించిన స్క్రిప్ట్‌ను తయారుచేసుకున్న వర్మ ఆ స్టోరీని అమితాబ్‌కు వినిపించాడట. ఈ స్టోరీ అమితాబ్‌కు విపరీతంగా నచ్చడంతో పచ్చజెండా ఊపాడు. అయితే ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ నటించడం లేదు. ఈ స్టోరీ నచ్చడం వల్లే ఈ చిత్రం చేస్తున్నానని అమితాబ్ అంటున్నాడు. కాగా ఈచిత్రాన్ని ముంబైతోపాటు లండన్ బ్యాక్‌డ్రాప్‌తో తీయడానికి వర్మ రెడీ అయ్యాడు. అసలు ఈమద్య కాలంలో వర్మకు కనీసం యావరేజ్ చిత్రం కూడా లేదు. 'కిల్లింగ్ వీరప్పన్' మాత్రమే ఫర్వాలేదనిపించింది. రీసెంట్‌గా ఇలాంటి బ్యాడ్ ట్రాక్‌రికార్డు ఉన్న వర్మ దర్శకత్వంలో చేయడానికి బాలీవుడ్ మెగాస్టార్ ఒప్పుకోవడం నిజంగా ఆశ్యర్యకరమే.