ప్రస్తుతం ఎండాకాలంలో మునుపెన్నడు లేని విధంగా నీటి కొరత జఠిలం అవుతోంది. దేశవ్యాప్తండా అదే పరిస్థితి నెలకొని ఉంది. లాత్తూరు తరహాలోనే అన్ని చోట్లా తాగునీటి కోసం కూడా జనాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల కోసం లక్షలాది లీటర్ల నీరును వృధా చేయడం అనుచితమని హైకోర్టు ఆదేశించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఐపిఎల్‌లోని మూడు మ్యాచ్‌లను ఆడటానికి విముఖత చూపించింది. అయితే పూణె జట్టు కోరిందే తడవుగా మహారాష్ట్ర ప్రభుత్వం వద్దనుకున్న మ్యాచ్‌లను విశాఖపట్నంలో జరపడానికి రెడ్ కార్పెట్ పరిచారు. మరీ మహారాష్ట్రలో ఉన్నంత నీటి కొరత విశాఖలో లేకపోయినప్పటికీ అక్కడ కూడా ఇప్పటికే ప్రజలకు తాగునీరు అందక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు ఎగిరిగంతేసి ఒప్పుకోవడం భావ్యం కాదని విశాఖ వాసులు మండిపడుతున్నారు. ప్రజలకు అత్యంత ముఖ్యమైన నీటి కొరతను, కరువును ఎదుర్కొంటూ కేవలం పేరు ప్రతిష్టల కోసం, మరీ ముఖ్యంగా తమకు లభించే ఆదాయం కోట్లలో ఉండటంతో విశాఖలో మ్యాచ్‌ల నిర్వహణకు గుడ్డిగా ఓకే చెప్పేశారు. అక్కడి అధికారులు మాత్రం ప్రస్తుతం స్టేడియం ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద చెరువు ఉండేదని, అందువల్ల భూగర్భ జలాలు స్టేడియం ప్రాంతంలో పుష్కళంగా ఉన్నాయనే వాదనను వినిపిస్తున్నారు. మొత్తానికి ఈ నిర్ణయంపై ప్రజలలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది.