మొత్తానికి 2019 ఎన్నికల నాటికి పవన్‌కళ్యాణ్ తన 'జనసేన' పార్టీని పట్టాలెక్కించనున్నాడు. ఆ ఎన్నికల నాటికి ఆయన ఎన్నికల బరిలో నిలవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా ఈ ఎండల వేడిమి కాస్త తగ్గిన తర్వాత దీనికి కార్యరూపం ఇవ్వాలని పవన్ డిసైడ్ అయ్యాడట. అటు ఎపీ, ఇటు తెలంగాణలల్లో కూడా ఆయన పార్టీ పోటీకి దిగే అవకాశం ఉన్నప్పటికీ పవన్ మాత్రం ఏపీనే టార్గెట్ చేసుకుంటున్నాడు. కిందటి ఎన్నికల్లో ఆయన మొదట బీజెపీకి మద్దతు పలికి చివరకు సంకీర్ణ ధర్మం ప్రకారం దాన్ని భాగస్వామి అయిన టిడిపిని కూడా బలపరిచాడు. వచ్చే ఎన్నికల్లో ఆయనను టిడిపి టార్గెట్ చేస్తే మాత్రం ఆయన ఓటర్లకు ఇందులో తన తప్పేమీ లేదని, కేవలం చంద్రబాబుకు ఉన్న అనుభవం రీత్యా తాను ఆనాడు అలాంటి నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని, కానీ టిడిపి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం అయినందునే తానే ముందుకు రావాల్సి వచ్చానని ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. కాగా పవన్ ఈ ఎండల తీవ్రత తగ్గిన తర్వాత అంటే దాదాపు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల భోగట్టా. ఇందులో తొలి విడతగా ఆయన దాదాపు 45 నియోజకవర్గాలను ఎంచుకున్నాడని సమాచారం. ధర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల సామాన్య ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రాంతాలు, ఫ్లోరైడ్ బాధితులు ఎక్కువగా ఉండి రక్షిత మంచినీటి కోసం పరితపించిపోతున్న ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు, రాజధాని పేరుతో ప్రభుత్వం భూమలును సొంతం చేసుకున్న నియోజకవర్గాలతో పాటు పలు సమస్యలతో అల్లలాడుతోన్న ప్రాంతాలపై ఆయన దృష్టి పెట్టి, తన వ్యూహంలో భాగంగా పర్యటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవంక ఆయన టిడిపితో సై అంటే సై అన్నే అవకాశం ఉందని, అయితే కేంద్రంలో, రాష్ట్రంలో ఆయన బిజెపికి మాత్రం అనూకూలంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చాడట. ఇక తామిద్దరం కలిసినా కూడా అన్నయ్య అన్నయ్యే... రాజకీయాలు రాజకీయాలే అని ఇటీవల ఇంటర్వ్యూలలో ఆయన తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అన్నయ్యను సీఎం చేయడానికి ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడనే వదంతులకు కూడా ఇంటర్య్యూలో ఆయన చెక్ పెట్టాడు. ఇక ఇటీవల జరిగిన కొన్ని సర్వేలలో కూడా ఏపీలో మూడో రాజకీయ పార్టీకి కూడా మనుగడకు అవకాశం ఉందని తేలడంతో పవన్ నిర్ణయం ఈ దిశగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. మొత్తానికి 2019 కోసం ఇప్పటినుండే పవన్ తన ఎత్తుగడలకు తుదిమెరుగులు దిద్దుతున్నాడు.