తన మొదటి చిత్రాన్ని వడివేలు హీరోగా 'హింసించే రాజు 23వ పులకేశి'తో భారీ విజయం నమోదు చేసుకున్న దర్శకుడు చింబుదేవన్. ఆతర్వాత ఆయన 100కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళస్టార్ విజయ్ హీరోగా శ్రీదేవి, హన్సిక, శృతిహాసన్‌లతో తీసిన 'పులి' చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. కనీసం ఈ చిత్రానికి పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. అంతేకాదు..ఈ చిత్రం డిజాస్టర్ కావడానికి దర్శకుడే కారణం అని విజయ్ అభిమానులు ఆందోళన చేశారు. అతిలోక సుందరి శ్రీదేవి అయితే ఈ చిత్రంలో నటించినందుకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని పూర్తిగా ఇవ్వలేదంటూ ఆందోళన చేసింది. వీటన్నిటి తర్వాత ఇక చింబుదేవన్‌కు మరో అవకాశం రావడం కష్టమే అని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా తన మొదటి చిత్రానికి సీక్వెల్ చేయమని వడివేలుతో సహా ఓ నిర్మాత కూడా ముందుకు వచ్చాడు. దాంతో ఈ చిత్రం సీక్వెల్‌ను తయారుచేయడానికి చింబుదేవన్ సంసిద్దుడు అవుతున్నాడు. మరి ఈ చిత్రంతోనైనా మరలా తన సత్తాను చింబుదేవన్ నిలబెట్టుకుంటాడో లేదో చూడాల్సివుంది!