వేసవి సెలవులు మొదలయితే చాలు తెలుగు ప్రేక్షకులు ముందుగా సేద తీరేది సినిమాలతోనే. హిట్టా, ఫట్టా అన్నది తరువాతి సంగతి. ముందుగా బొమ్మ పడిన వెంటనే చూసేసామా లేదా అన్నదే ఇక్కడ లెక్కకు అందని తిక్క. ఇక స్టార్ హీరోల సినిమాలకయితే ఈ లెక్క మరింత క్లిష్టంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ నుండి ఊహించని పరిణామమే అయినా, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమా వన్ సైడెడ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా యాభై కోట్లు కలెక్ట్ చేసిందంటే అది ఖచ్చితంగా ఓపెనింగ్ కలెక్షన్ల ప్రభావమే. అందుకే రేపు వస్తున్న అల్లు అర్జున్ సరైనోడు కోసం నిర్మాత అల్లు అరవింద్ గారు ఏకంగా 2000 స్క్రీన్స్ బుక్ చేయించారట. బన్నీకి ఉన్న మార్కెట్ వ్యాల్యూ దృష్ట్యా ఇది కొంచెం ఎక్కువ సంఖ్యే అయినా, రిలీజ్ టైంని బట్టి చూస్తే సరైన ఎత్తుగడే. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా భారీ ఎత్తున బన్నీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ప్రమోషన్లు, మార్కెటింగ్ ప్రణాలికలు, జనాల అంచనాలు అన్నీ సరిగ్గా వర్క్ అవుట్ అయితే సరైనోడు కూడా సర్దార్ స్థాయిలో కాకపోయినా ఇంచుమించుగా రికార్డులు బద్దలు కొట్టే వసూళ్లు రాబట్టే సూచనలు ఉన్నాయన్నది ట్రేడ్ విశ్లేషకుల అంచనా.