బోయపాటి శ్రీను తనకంటూ ఓ ప్రత్యేక దర్శకత్వ శైలిని ఏర్పరుచుకున్నారు. టైటిల్ చెప్పకుండా సినిమా వేసేసి దీన్ని ఎవరు డైరెక్ట్ చేసారో చెప్పేయమంటే సగటు సినీ ప్రేక్షకుడు బోయపాటి మార్కుని యిట్టె పసిగట్టేయగలడు. ఓ దర్శకుడిగా ఇది బోయపాటి పటిమకి తార్కాణమే అయినా ఒక్కోసారి ఇదే అతని పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ శాపం తాలూకు ఛాయలు జూనియర్ ఎన్టీయార్ నటించిన దమ్ములో ఎక్కువగా అగుపిస్తాయి. ఓ యాక్షన్ సినిమా పరిపూర్ణంగా జనాన్ని మెప్పించాలంటే అందులోని ఎమోషన్ ముందుగా ప్రేక్షకుడి నాడికి ట్యూన్ కావాలి. ఈ ట్యూనింగ్ తేడా కొట్టేస్తే సినిమా మొత్తంగా పెద్ద సమస్య అయి కూర్చుంటుంది. ఈ యాక్షన్, ఎమోషన్ బ్యాలెన్స్ చేయడంలోనే బోయపాటి సినిమాలు జనాలని కొంత నిరాశకు గురిచేస్తుంటాయి. హీరో చేసే వీరోచిత పోరాటాలు, రక్తం ఏరులై పారటాలు లాంటివి బోయపాటి చిత్రాల్లో బాగా రిజిస్టర్ అవుతుంటాయి. రేపు రాబోతున్న సరైనోడు చిత్రం యొక్క ట్రైలర్ గమనిస్తే నిర్మాతలు ఎంతో చాకచక్యంగా బోయపాటి యాక్షన్ మార్కును మాత్రమే స్పష్టం చేసారు. మరి డ్రామా, సెంటిమెంట్ లాంటి ఇతర తెలుగు సినిమా సరంజామా సరైనోడుకి సరైన పాళ్ళలోనే కలిసిందా లేదా అన్నది రేపు వెండి తెర మీద వీక్షిస్తే గానీ చెప్పలేం!