వాస్తవానికి పెద్ద చిత్రాలు సరైన ప్లానింగ్ లేకపోవడం, రిలీజ్ డేట్స్ విషయంలో ముందుగా క్లారిటీ ఇవ్వకపోవడం టాలీవుడ్ దురదృష్టం. బాలీవుడ్‌లో మాత్రం పెద్ద చిత్రాలను సినిమా ముహూర్తం రోజే రిలీజ్ డేట్‌ను ప్రకటించే మంచి సంప్రదాయం ఉంది. టాలీవుడ్‌లో రామ్‌చరణ్ వంటి కొందరు హీరోలే ఇతరులకు, మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇబ్బంది లేకుండా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. కాగా మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పివిపి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బ్రహ్మూెత్సవం చిత్రానికి ఇప్పటికీ రిలీజ్ డేట్‌ను ప్రకటించలేదు. మొత్తానికి ఈ చిత్రం మే నెలలోనే విడుదల అవుతుందన్నది మాత్రం ఖాయం. కానీ ఇప్పటికే మే 6, మే 13, మే 20 ఇలా ఎన్నో డేట్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. అయినా ఈ విషయంపై ఈ చిత్ర యూనిట్ స్పందించడం లేదు. దీంతో చాలా చిన్న, మీడియం రేంజ్ చిత్రాల విడుదల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతోంది. నితిన్- త్రివిక్రమ్‌ల అ...ఆ, దిల్‌రాజు- అనిల్‌రావిపూడి- సాయిధరమ్‌తేజ్‌ల సుప్రీమ్ లు తమ రిలీజ్ డేట్స్‌ను కన్‌ఫర్మ్ చేయలేకపోతున్నాయి. వాస్తవానికి సూర్య 24 చిత్రంతో పాటు అ..ఆ సినిమా కూడా మే 6న విడుదల చేయాలని భావించినప్పటికీ 24 తెలుగు వెర్షన్ రైట్స్ నితిన్ చేతిలో ఉండటం వల్ల ఆ తేదీన అ..ఆ, 24 చిత్రాలు రెండు విడుదలయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. కాగా తాజా సమాచారం ప్రకారం 24 ప్రాజెక్ట్ నుండి నితిన్ బయటకు వచ్చాడు. మే 6న విడుదల చేయలేమని నితిన్ సూర్యకు తెలపడం, కానీ ఎట్టిపరిస్దితుల్లోనూ తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు వెర్షన్‌ను కూడా రిలీజ్ చేయాలని సూర్య కుండబద్దలు కొట్టడంతో ఈ చిత్రం నుండి నితిన్ డ్రాప్ అయ్యాడు. తమిళంలో ఈచిత్రాన్ని నిర్మిస్తున్న స్టూడియో గ్రీన్ సంస్ధే తెలుగు వెర్షన్‌ను కూడా రిలీజ్ చేయనుంది. మొత్తానికి ముందుగా రిలీజ్ డేట్ ప్రకటించి ఆ తర్వాత మహేష్ చిత్రం రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తే ఇబ్బందులు పడాల్సివస్తుందని దిల్‌రాజు, త్రివిక్రమ్ భావిస్తున్నారు. మొత్తానికి మే 6వ తేదీనే అ...ఆ, సుప్రీమ్‌లు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం.