ఆమెకి ఓటు కూడా లేదట. కానీ ఏకంగా ఎమ్మెల్యే అయిపోయింది. ఓటు వేయనివాళ్లకి ఓటు వేయించుకొని ఎమ్మెల్యే అయ్యే హక్కు ఎక్కడుంది చెప్పండి? ఇదే మాటంటే కేథరిన్ కిలకిలా నవ్వేస్తోంది. కేథరిన్‌కీ, ఎమ్మెల్యే పదవికి సంబంధమేంటంటారా? సరైనోడు సినిమాలో ఆమె యంగ్ ఎమ్మెల్యేగా నటించిందిలెండి. ఎమ్మెల్యేగా నటించారుగా, మరి మీకు నిజ జీవితంలో రాజకీయాలంటే ఇష్టమా? అని అడిగితే... 'నాకా? రాజకీయాలా? బొత్తిగా అర్థం కావు. ఆ మాటకొస్తే ఇప్పటిదాకా నాకు ఓటు హక్కే లేదు. ఓటు వేయాలని, ఆ లిస్టులో నా పేరు వుండాలని ఎప్పుడూ అనిపించలేదు. అందుకే ఇప్పటిదాకా నేను ఓటే తీసుకోలేదు. చిత్రంగా సినిమాలో మాత్రం ఎమ్మెల్యేగా నటించాను' అని చెప్పుకొచ్చింది కేథరిన్. నిజంగా ఇది టూ మచ్ కదా!
కేథరిన్‌లాంటి ఓ అందమైన అమ్మాయి ఎమ్మెల్యే పాత్రలో కనిపిస్తుందంటే కచ్చితంగా అది సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టుగానే వుంటుంది. అలాంటి పాత్రలో ఈమధ్య ఏ హీరోయిన్ కూడా కనిపించిన దాఖలాలు లేవు. సో... బొమ్మ పడకముందే కేథరిన్ క్యారెక్టర్ సూపర్‌హిట్టని చెప్పేయొచ్చన్నమాట. కానీ ఈ సినిమాలో ఎమ్మెల్యే పాత్ర చేశాక వెంటనే ఓటు హక్కు పొందాలని డిసైడ్ అయినట్టు చెప్పింది కేథరిన్. మొత్తానికి మంచి డెసిషనే తీసుకొంది కదా! అన్నట్టు ఈ సందర్భంగా టాలీవుడ్‌లో సినీ ప్రయాణం గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చింది కేథరిన్. 'తెలుగులో ఎక్సయింటింగ్ కథలే రావడం లేదు. ఇక నేనేం చేసేది? అందుకే తమిళంలో మంచి కథలు దొరుకుతున్నందున అక్కడికి వెళ్లి నటిస్తున్నా. కానీ బన్నీతో మూడు సినిమాలు చేయడం మాత్రం చాలా హ్యాపీ. తనకీ, నాకూ అలా కుదురుతుందంతే. అంతే తప్ప పనిగట్టుకొని మేం కలిసి నటించడం లేదు'.. అని చెప్పుకొచ్చింది కేథరిన్.