మన దర్శకులు రెండున్నర గంటల సినిమాను మూడున్నర గంటలు తీయడంలో సిద్దహస్తులు. చివరి నిమిషంలో నిడివి సమస్య వచ్చి కొన్ని సన్నివేశాలను
ఎడిట్ చేస్తుంటారు. ఒక వేళ సినిమా మంచి హిట్ అయితే అలా ఎడిట్ చేసిన కొన్ని సీన్స్‌ను మూడు నాలుగు వారాల తర్వాత కలిపి మరలా ప్రేక్షకులకు రెండోసారి చూపించేందుకు వాటిని వాడేసుకుంటారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో కొత్త ప్రమోషన్ మొదలైంది. ఇప్పుడు అందరూ దీన్నే ఫ్యాషన్‌గా ఫాలో అవుతున్నారు. గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో బ్రహ్మానందం నటించిన సన్నివేశాలను కలిపారు. ఇక 'మిర్చి'లో ఓ రెయిన్ ఫైట్‌ను కలిపారు. 'శ్రీమంతుడు' చిత్రానికి కూడా కొన్ని సీన్స్ యాడ్ చేశారు. 'నేను శైలజ, టెంపర్' వంటి చిత్రాల విషయంలో కూడా అదే జరిగింది. కానీ తాజాగా మార్చి 25న విడుదలైన నాగార్జున, కార్తి, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'ఊపిరి' చిత్రం ఆ తర్వాత విడుదలైన అనేక చిత్రాల పోటీని కూడా తట్టుకొని దిగ్విజయంగా ఆడుతోంది. కాగా ఈ చిత్రం కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ చిత్రం 100కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా ఈ చిత్రంలో కూడా విడుదలకు ముందు ఎడిట్ చేసిన కొన్ని సీన్స్‌ను అదనంగా కలుపుతున్నారు. మరి ఈ నిర్ణయం వల్ల రిపీట్ ఆడియన్స్ వస్తారని యూనిట్ భావిస్తోంది.