చిరంజీవి తారు రోడ్డు వేస్తే ఆయన కుటుంబ సభ్యులందరూ దానిపై హాయిగా జర్నీ చేస్తున్నారని తండ్రి కొడుకులు (అల్లు అరవింద్, అల్లు అర్జున్) ఒకే మాటగా చెప్పారు. చిరంజీవి తెచ్చుకున్న స్టార్ డమ్ తమకు ఉపయోగపడిందనేది వారి ఉద్దేశం. 'హ్యాపీ జర్నీ' చేస్తున్న పవన్ కల్యాణ్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ, అల్లు అర్జున్ గురించే ఈ మాటలు. బావను గుప్పిట్లో పెట్టుకుని అరవింద్ నిర్మాతగా చాలా కాలం చక్రం తిప్పారు. ఇంకా అరవింద్ తోడల్లుడు డా.వెంకటేశ్వరరావుకు సైతం చిరు ఉపయోగపడ్డారు. ఇంతవరకు బాగానే ఉంది మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు మాత్రం నటుడిగా, నిర్మాతగా ఎదగలేకపోయారు. మరి తారు రోడ్డు పై ఆయన ప్రయాణం చేయలేదా..? ఎవరైనా చేయకుండా ఆపేశారా.? నాగబాబు హీరోగా సక్సెస్ కాలేక, క్యారెక్టర్ వేషాలు పరిమిత సంఖ్యలో మాత్రమే చేసి, ఇప్పుడు టీవీ షోలకే పరిమితమయ్యారు. చిరంజీవి స్టార్ డమ్ 'ఉపయోగపడనిది' నాగబాబుకు మాత్రమే అని అందరూ అంగీకరిస్తారు. అయినప్పటికీ చాలా సందర్భాల్లో చిరంజీవికి సపోర్ట్ గా నాగబాబు నిలబడ్డారు.
మెగా కాంపౌండ్ లో ఎదిగిన హీరోలు 'సినిమా చేయండి' అంటూ నాగబాబుకు డేట్స్ కూడా ఇవ్వరు. వేదికలపై ఆయన గురించి ఒక్కమాట కూడా చెప్పరు. ఇటీవలే జరిగిన 'సుప్రీమ్' పాటల విడుదల వేడుకలో అల్లు అరవింద్ నాగబాబు గురించి కానీ, వేదికపైనే ఉన్న వరుణ్ తేజ గురించి కానీ ప్రస్తావించలేదు. ఎందుకంటే చిరంజీవి వేసిన తారు రోడ్డును ఆయనే బాగా ఉపయోగించుకున్నారు కాబట్టి.