ఒకప్పటిలా మా సినిమా అంత కలెక్ట్ చేసింది.. అన్నీ చోట్లా హౌస్‌ఫుల్స్‌తో నడుస్తోంది. థియేటర్లు పెంచుతున్నాం.. అంటూ చేసే తప్పుడు పబ్లిసిటీని నేడు ప్రేక్షకులెవ్వరు నమ్మడం లేదు. మీడియాలో వచ్చే వార్తలకు, సక్సెస్‌మీట్‌లను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తమ సినిమా అద్భుతంగా ఉందని చేసే స్టేట్‌మెంట్లకు కాలం చెల్లిపోయింది. సినిమా విడుదలైన మొదటిరోజే సినిమా పరిస్ధితి ఏమిటో? అందరికీ అర్థమైపోతోంది. తాజాగా విడుదలైన మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌లు కలిసి నటించిన 'ఈడో రకం..ఆడో రకం' చిత్రం సినిమా విడుదల రోజునే టాక్ కాస్త తక్కువగా వచ్చింది. కనీసం ఓ మోస్తరు ఓపెనింగ్స్ కూడా లేవు. కానీ మోహన్‌బాబు మాత్రం ఈ సినిమా గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తాను తన అభిమానులతో కలిసి ఈ చిత్రం చూడటానికి వెళ్లితే తనకు టిక్కెట్స్ దొరకలేదని, దాంతో బాధతో కూడిన ఆనందం కలిగిందని, నిర్మాతను అడిగి మరీ పక్కరోజు టిక్కెట్స్ తెప్పించుకున్నానని, తన కుమారుడి సినిమాకు థియేటర్లు పెంచుతున్నారని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ ట్వీట్‌ను చూసి అందరూ అబ్బుర పడుతున్నారు. టిక్కెట్లు కావాలంటే మేమిప్పిస్తాం.. అంటూ కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. మరి ఇంత సీనియర్ అయిన మోహన్‌బాబు ఇలాంటి ప్రకటనలు ఇచ్చి తనకున్న ఇజ్జత్ ను కోల్పోతున్నాడని కొందరు అనుకుంటున్నారు. సినిమా బావుంది. అందరూ చూడండి అంటే సరిపోయేది. అలా కాకుండా మోహన్ బాబు మాట్లాడిన మాటలు సినిమా పై మరో రకపు అర్ధం తెచ్చేలా వున్నాయని కూడా ప్రేక్షకులు గమనించగలరు.