టాలీవుడ్‌ని పైరసీ పట్టి పీడిస్తోంది. ఇదివరకు సినిమా విడుదలయ్యాకే పైరసీ అయ్యేది. ఇప్పుడు విడుదలకు ముందే సినిమా బయటికొచ్చేస్తుంది. లీకు వీరులు ఏకంగా సినిమా ఎడిట్ రూముల్లోకే జొరబడుతున్నారు. ఇంటిదొంగల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని స్పష్టంగా తెలుస్తోంది కానీ, ఆ దొంగల్ని మాత్రం ఈశ్వరుడు కూడా పట్టలేకపోతున్నాడు. ఆమధ్య అత్తారింటికి దారేది విషయంలో చోటు చేసుకొన్న లీకుతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తం వులిక్కిపడింది. విడుదలకి ముందే సగం సినిమా బయటికొచ్చేసింది. దాంతో సినీ పరిశ్రమలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఎవరికి వాళ్లు మన సినిమా జాగ్రత్తేగా అని ఒకటికి పదిమార్లు చూసుకొన్నాయి. ఆ తర్వాత కూడా ఆ జాగ్రత్తలు కంటిన్యూ అయ్యాయి కానీ లీకువీరులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బాహుబలి సినిమా మొదలు ప్రతీ సినిమాని ఏదో రకంగా లీకు చేస్తూనే వస్తున్నారు. బాహుబలిలోని కొన్ని సన్నివేశాలు అప్పట్లో బయటికొచ్చాయి. కానీ చిత్రబృందం అత్యాధునిక సాంకేతికతని ఉపయోగించి లీకైన సన్నివేశాల్ని తొలగించింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాలకి అదే అనుభవం ఎదురైంది. ఇప్పుడేమో సరైనోడు లీకు బారిన పడిందని టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. సినిమాలోని పదిహేను నిమిషాల సన్నివేశాలు బయటికొచ్చాయట, అవి బయటి ప్రపంచం చూడకమునుపే ఇంటర్నెట్‌లో ఆ లింకులన్నింటినీ గీతా ఆర్ట్స్ సంస్థ తొలగించిందట. ఆ విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సరైనోడు ఎలా లీకైందన్నదే ఇప్పుడు ప్రశ్న. చిత్రబృందం మాత్రం మా సినిమా లీకవ్వలేదని చెబుతోంది. కానీ లీకుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అన్న విషయం ఇలాంటి వార్తలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.