సన్ స్ట్రోక్ పొలిటీషియన్లకే కాదు సినీ సెలబ్రిటీలకు సైతం తప్పదు. పొలిటీషియన్ల పుత్రరత్నాలు తాగితందనాలు ఆడడమో లేదా యాక్సిడెంట్స్ చేయడం వల్లో మీడియా దృష్టికి వస్తారు. దీనివల్ల కొద్ది రోజులు హడావుడి తప్ప మరేమి ఉండదు. కానీ, సినిమా వాళ్ళకి మాత్రం సన్ స్ట్రోక్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆర్థికమూలాలనే పెకిలివేస్తుంది. ప్రస్తుతం కొందరు హీరోలు, నిర్మాతలు ఇదే సమస్యతో సతమతమవుతున్నారు. పైగా వారసులను నిలబెట్టడానికి వారి తండ్రులు శ్రమపడాల్సి వస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ హీరోల స్థానాల్లో చాలా వెనకబడి ఉన్నారు. బ్రూస్ లీ పరాజయం కొణదెల ఫ్యామిలీని ఇబ్బంది పెట్టింది. పైగా చిరంజీవి ప్రేరణతో హీరోలైన అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ ఫామ్ లో ఉన్నారు. చరణ్ సైతం మళ్లీ వేగం అందుకోవాలి ఇందుకోసం రీమేక్ సినిమాని నమ్ముకున్నారు. నిర్మాణ బాధ్యతలను అల్లు అరవింద్ కు అప్పజెప్పారు. సినీరంగంలో పరాజయాలనేవి తాత్కాలికమే. చరిత్రలో ఫ్లాపుల్లేని హీరోలు లేరు.
వరుస విజయాలతో జోరు మీదున్న నాగార్జున తన సక్సెస్ లకు ఆనందించినా వారసులిద్దరు నాగచైతన్య, అఖిల్ ఇంకా ఫామ్ లోకి రాకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. తను పట్టించుకోకపోవడం వల్లే సక్సెస్ లు రాలేదని అభిమానులకు సర్ది చెప్పాడు. తనతో హిట్ సినిమాలు తీసిన దర్శకులను బ్లాక్ చేసి వారసుల సినిమాలకు దర్శకత్వం వహించేలా ప్లాన్ చేస్తున్నారు.
మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు తన వారసుడు వరుణ్ తేజ్ కు మంచి పొజీషన్ రావడం కోసం ప్లాన్ చేస్తున్నారు. సొంతంగా నిర్మించి చేతులు కాల్చుకునే సాహసం చేయకుండా ఖర్చు పెట్టి తీయగలిగే నిర్మాతలను వెతుకుతున్నారు. ముకుందా, కంచె, లోఫర్ చిత్రాలు వరుణ్ కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. నాగబాబు తనయ నిహారిక కూడా హీరోయన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. కొణదెల కుటుంబంలోంచి హీరోయిన్ రావడం ఇదే ప్రధమం.
గతంలో భారీ చిత్రాలు నిర్మించి సంక్రాంతి మెునగాడుగా పేరు తెచ్చుకున్న నిర్మాత ఎం.ఎస్.రాజు తన కుమారుడు సమంత్ అశ్విన్ ను హీరోని చేసిన విషయం తెలిసిందే. పలు హిట్స్ తీసిన రాజుగారు అదే రీతిలో ఫ్లాప్ లు తీసి దెబ్బతిన్నారు. బయటి హీరోలతో తీయడంకంటే మన ఇంట్లోనే ఒక హీరో ఉంటే బెటర్ అని రామానాయుడు చెప్పిన విషయాన్ని ఫాలో అయ్యారు. సుమంత్ ను హీరోని చేశారు. కానీ ఈ కుర్ర హీరో ఇంకా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగోనలేకపోతున్నాడు. బయటి చిత్రాల్లో సుమంత్ కు అవకాశాలు వస్తున్నా తెరవెనుక పెట్టుబడి రాజుగారిదే అని ప్రచారం జరుగుతోంది.
నాన్ కాంట్రవర్సీ హీరో శ్రీకాంత్ తను హీరోగా ఫేడవుట్ అవుతున్న తరుణంలో వారసుడు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. రోషన్ కు తొలి అవకాశమే అన్నపూర్ణ స్టూడియో నుండి రావడం విశేషం. సినిమా పేరు నిర్మల కాన్వెంట్. ఈ చిత్రం రిలీజ్ కు వచ్చినా వాయిదా పడుతోంది. సినిమా రిలీజ్ అవుతే కానీ రోషన్ ఫ్యూచర్ ఏమిటనేది స్పష్టం కాదు.
ఒకప్పటి సీనియర్ నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు జోతికృష్ణ దర్శకుడిగా మరో అటెమ్ట్ చేస్తున్నాడు. గతంలో కొడుకుల ఎఫేక్ట్ కి ఆర్థికంగా చితికిపోయి, మళ్లీ పుంజుకున్న ఎ.ఎం.రత్నం మళ్లీ సాహసం చేస్తున్నట్టే. గోపిచంద్ హీరోగా జోతికృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ పేరుతో సినిమా రూపోందుతోంది.
తమకు తెలిసిన రంగంలోకి వారసులని తీసుకువచ్చే ప్రయత్నం అభినందించదగిందే. ఇప్పుడు వారసులు నిలదొక్కుకునేలా చేయడం సెలబ్రిటీల తక్షణ కర్తవ్యం.