బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం కోసం యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి పార్ట్1'లో ఉత్పన్నమైన ఈ ప్రశ్నకు త్వరలో రాబోతున్న 'బాహుబలి పార్ట్2'లో సమాధానం దొరకబోతోంది. అయితే తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న 'బాహుబలి' రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'బాహుబలి' చనిపోయాడని ఎందుకు బావించాలి? బతికి కూడా ఉండవచ్చు అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. మరి విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. 'బాహుబలి' సినిమా విడుదలకు ముందే రెండు భాగాలకు సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయిందని, 'బాహుబలి' భారీ విజయం తర్వాత సీక్వెల్‌లో ఎటువంటి మార్పులు చేయడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సినిమాకు సంబందించిన ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. 'బాహుబలి' సినిమాలోని పాత్రలను మహాభారతం, రామాయణంలోని పాత్రలను స్ఫూర్తిగా తీసుకొని రూపొందించినవే అని విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. భీష్ముడి స్ఫూర్తితో కట్టప్ప పాత్రను, శివగామిలో కైకేయి, గాంధారి, కుంతి ఛాయలు కనిపిస్తాయని, బిజ్జలదేవ పాత్రలో శకుని తత్వం కనిపిస్తుందని, భళ్లాలదేవ పాత్రలో రావణుడు, దుర్యోధనుడు కనిపిస్తారని, బాహుబలిలో అర్జునుడు, రాముడు కనిపిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.