రెండు రోజుల పాటు వివిధ ఛానల్స్ కు పవన్ కల్యాణ్ సుదీర్ఘమైన ఇంటర్య్వూ లు ఇచ్చారు. దాదాపు అన్ని న్యూస్ ఛానల్స్ ఇంటర్య్వూ చేసినప్పటికీ సాక్షి ఛానల్ మాత్రం పవన్ ని ఇంటర్యూ చేయలేదు. పేపర్ లో మాత్రం ఇంటర్య్వూ ప్రచురించారు. ఛానల్ కోసం మాత్రం పవన్ ని ఇంటర్య్వూ చేయలేదు. ఒకే గొడుగు కింద పనిచేసే పేపర్, ఛానల్ కు పాలసీలు మాత్రం వేరుగా ఉండడం విశేషం.
నిజానికి పవన్ తన ఇంటర్య్వూలో రాజకీయాల గురించి మాట్లాడినా వైకాపా పార్టీ గురించి కానీ, జగన్ గురించి కానీ ఎక్కడా విమర్శలు చేయలేదు. పైగా చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదని హితవు చెప్పారు. అయినప్పటికీ సాక్షి ఛానల్ అలగడానికి కారణాలు అనేకం ఉన్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను అని ప్రకటించారు. ఇది జగన్ పార్టీకి మింగుడు పడకపోవచ్చు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. చంద్రబాబును నేరుగా అంటే ముఖాముఖిన ఢీకొంటే గెలుస్తామని ఆయన నమ్మకం. మధ్యలో పవన్ పార్టీ పోటీకి దిగితే ఓట్లు చీలిపోతాయి. ముఖ్యంగా కాపు వర్గం ఆయన వెంటే ఉంటుంది. దీనివల్ల ఇబ్బంది తప్పదు. ఒకసారి ఫ్యాష్ బ్యాక్ లోకి వెళితే వై.యస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పటికే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గెలిచే అవకాశాలను దెబ్బతీశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సరిగ్గా అదే సీన్ వచ్చే ఎన్నికల్లో రిపీట్ అయితే వైకాపా పరిస్థితి గందరగోళంలో పడుతుంది. అందుకే సాక్షి మీడియా ద్వారా పవన్ కు ప్రచారం తగ్గించాలని దాని యాజమాన్యం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.