తెలంగాణ ఏర్పడ్డాక, ముఖ్యమంత్రిగా బాథ్యతలు చేపట్టాక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులో ఆంధ్రా వ్యతిరేకత పోయింది. ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా ఇది రుజువైంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలిచిన కార్పోరేటర్లకు రెండు రోజులుగా హైదరాబాద్ లో శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం నగరశివారులోని ప్రగతి రిసార్ట్ ను ఎంపికచేసుకున్నారు. ఈ రిసార్ట్ జి.వి.రావుకు చెందింది. ఆయన ఆంధ్ర నుండి వచ్చి తెలంగాణలో సెటిలైన వ్యక్తి. నిజానికి తెలంగాణకు చెందిన వ్యక్తులకు కూడా హైదరాబాద్ శివారులో రిసార్టులున్నాయి. కానీ కేసీఆర్, కేటీఆర్ ప్రగతి రిసార్ట్ కే మెుగ్గుచూపడం విశేషం. దీని అధినేత తెరాసలోని కొందరు ముఖ్యులకు సన్నిహితుడు. పైగా ఆయన తెలంగాణ ప్రభుత్వం చేబడుతున్న హరితవనం ప్రాజెక్ట్ లో భాగస్వామికానున్నారని సమాచారం. ఈ కారణం చేత కార్పోరేటర్ల శిక్షణ తరగతులకు ప్రగతిని ఎంపికచేసుకున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి. శిక్షణలో భాగంగా మెుదటి రోజు కేసీఆర్ ఆ తర్వాత కేటీఆర్ ప్రజలతో ఎలా మమేకం కావాలనేది కార్పోరేటర్లకు సూచించారు.
ప్రాంతం ఏదైనప్పటికీ తెలంగాణ అభివృద్దిలో అందరిని కలుపుకుపోవాలనేది కేసీఆర్ వ్యూహం. అందుకే పెట్టుబడుల కోసం విదేశీ సంస్థలకు కూడా ఆహ్వానం పలుకుతున్నారు.