పాలకొల్లు ఒక చిన్న గ్రామం. అక్కడ నివసించే ఐదు అడుగులైనా లేని ఒక మధ్యతరగతి జీవికి నటన అంటే ఇష్టం. సినీ ప్రయత్నాలు చేయాలంటే మద్రాసులో తెలిసివారెవరూ లేరు. అయినా తనపై తనకున్న నమ్మకం, కొంత పరిచయం వున్న హోమియో వైద్యం. ఇవే పెట్టుబడులుగా మద్రాసు చేరి ఒక వైపు వైద్యం చేస్తూ, మరోవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి చివరికి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తిరుగులేని స్థానం సంపాదించుకున్న నటుడు అల్లు రామలింగయ్య. చిన్నా చితక వేషాల నుండి ప్రాధాన్యత ఉన్న పాత్రల వరకు చేసి తన కుటుంబానికి ప్లాట్ ఫాం ఏర్పాటుచేశారు. అలాంటి అల్లు రామలింగయ్య గురించి ఆయన వారసులే మరిచిపోవడం గమనార్హం. సరైనోడు వేడుకలో తమకు ప్లాట్ ఫామ్ వేసింది మెగాస్టార్ చిరంజీవి అంటూ వెల్లడించారు అల్లు అర్జున్. కానీ యాభై యేళ్ళ క్రితమే తన తాత రామలింగయ్య తమ కుటుంబానికి బంగారుబాట వేసిన విషయం బహుషా పిల్లాడైన అర్జున్ కు గుర్తులేకున్నా అరవింద్ కైనా గుర్తుకురావాలి. దిగువ మధ్య తరగతి కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దిన అల్లు రామలింగయ్య అంటే చిత్ర పరిశ్రమలో అందరికీ గౌరవమే ఉండేది. కొడుకు అరవింద్ ను నిర్మాతను చేసి దారిచూపారు. చిరంజీవిని అల్లుడిగా చేసుకున్నారు. ఇంతటి చరిత్ర ఉన్న రామలింగయ్య చరిత్రను వారసులు మర్చిపోయారు. మెగాస్టార్ చిరంజీవి ఇరు కుటుంబాలకు స్టార్ డమ్ తెచ్చారంటే ఒప్పుకోవచ్చు. కానీ కుటుంబం మూలాలనే అల్లు వారసులు మర్చిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో అనుభవంతో చిరంజీవిని పొగడడమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు రామలింగయ్య నట(కుటుంబ)వారసుడు అల్లు అర్జున్. చిరంజీవిని ప్రసన్నం చేసుకోవడానికే అర్జున్ అలా మాట్లాడి ఉంటారనేది స్పష్టమవుతోంది.