ఒకరి కోసం సిద్ధమైన కథల్లో మరొకరు నటించడం చిత్రసీమలో సాధారణమే. పవన్ కోసం త్రివిక్రమ్ రాసుకున్న అతడు కథలో మహేష్ నటించిన విషయం తెలిసిందే. అలా ఇండస్ట్రీలో బోలెడన్ని కథలు హీరోల్ని మార్చుకున్నాయి. తాజాగా అలా హీరోని మార్చుకున్న మరో చిత్రం వెలుగులోకి వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రవితేజ చేసిన భద్ర సినిమాని అల్లు అర్జున్ చేయాల్సిందట. మొదట అల్లు అర్జున్‌కే ఆ కథని వినిపించాడట బోయపాటి. అయితే అప్పటికే ఆర్య సినిమాలో నటిస్తున్న బన్నీకి కథ నచ్చిందట కానీ... ఆ టైమ్‌లో తాను చేయాల్సిన సినిమా ఇది కాదనే విషయం అర్థమైందట. అందుకే ఆ కథని కాదనకుండా దిల్‌రాజు దృష్టికి తీసుకెళ్లాడట. స్వయంగా ఫోన్ చేసి బోయపాటి కథ చెబుతాడు, వినండి అని దిల్‌రాజుకి బన్నీ రెకమెండ్ చేశాడట. అలా దిల్‌రాజు కథ వినడం, ఆయనకి నచ్చడం, రవితేజతో సినిమా చేయడం చకచకా జరిగిపోయాయి. అందుకే నాకు దర్శకుడిగా తొలి ఛాన్స్ మాత్రం బన్నీవల్లే వచ్చిందని బోయపాటి శ్రీను చెప్పాడు. నిన్న విశాఖలో జరిగిన సరైనోడు ఆడియో సక్సెస్ మీట్‌లో ఈ విషయాన్ని బోయపాటి వెల్లడించాడు. సరైనోడు సినిమా వేడుకే ఆ విషయం చెప్పడానికి సరైందనిపించిందని, అసలైన సరైనోడు అంటే బన్నీనే అనీ ఆకాశానికెత్తేశాడు బోయపాటి. అయితే అప్పట్లో బన్నీ తీసుకున్న నిర్ణయం మాత్రం పక్కాగా సరైనదని చెప్పొచ్చు. అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తున్న బన్నీకి భద్రలాంటి సినిమా సెట్ కాదని పక్కాగా చెప్పొచ్చు. ఆ సినిమాని రవితేజ చేయడమే కరెక్టు. ఆ చిత్రంతో రవితేజకి హిట్టు వచ్చిందన్నా, బోయపాటికీ లైఫ్ దొరికిందన్నా బన్నీ తీసుకొన్న నిర్ణయమే కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు.