నిప్పులేనిదే పొగరాదు అనే సామెత అందరికీ తెలిసిందే. తాజాగా ఒకప్పటి యాంగ్రీ యంగ్‌మేన్ రాజశేఖర్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న 'అహం' చిత్రంలో
నెగటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం కొద్దిరోజుల షూటింగ్ తర్వాత రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని.. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో? అర్థం కావడంలేదంటూ రాజశేఖర్ మీడియాపై విరుచుకుపడ్డాడు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ మొదలుకాలేదని, అలాంటిది ఈ చిత్రం మధ్యలో తాను బయటికి రావడం ఏమిటి? అంటున్నాడు. అంతేకాదు... ఇలాంటి వార్తలు రాసేటప్పుడు కనీసం హీరోని లేదా దర్శకుడిని అడిగి కన్‌ఫర్మ్ చేసుకోవాలని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఇదంతా బాగానే ఉంది కానీ మీడియా వారు ఇలాంటి అనుమానాలు నివృత్తి చేసుకోవాలంటే రాజశేఖర్, తేజ వంటి వారు అసలు మీడియా వ్యక్తులకు తమ స్పందన తెలియజేయరు కదా! కనీసం మాట్లాడటానికి కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారు. మరి ఈ విషయంలో మీడియాకు సహకరించాల్సిన బాధ్యత తమదే అన్న విషయం రాజశేఖర్ తెలుసుకుంటే మంచిదని మీడియా వర్గాలు అంటున్నాయి. అయినా కూడా ఈ చిత్రంలో రాజశేఖర్ చేయడం లేదన్న వార్త మాత్రం నిజమేనని మీడియా వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.