నిర్మాతగా దిల్ రాజు పేరు ప్రఖ్యాతులు తమిళతంబిలకు కూడా తెల్సు. మంచి మార్కెటింగ్ చేస్తాడని వాళ్ళు నమ్ముతారు. అందుకే డబ్బింగ్ రైట్స్ కోసం దిల్ రాజు ఆయనకే ఇచ్చేస్తారు. తాజాగా విజయ్ నటించిన తమిళ చిత్రం హక్కులు కొని పోలీసోడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు.
సమ్మర్ కు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ కోసం ఆగారు. ఆ సినిమా ఫలితం తేలగానే పోలీసోడులో కదలిక వచ్చింది. శనివారం చిత్ర వివరాలు వెల్లడించడం కోసం మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. సహజంగా దిల్ రాజు తన సొంత కార్యాలయంలోనే వీటిని నిర్వహించి టీ బిస్కెట్ ఖర్చుతో ముగించేస్తారు. ఇదంతా మీడియా మిత్రులకు తెలిసిందే. దీనికి భిన్నంగా పోలీసోడు మీట్ స్టార్ హోటల్లో ఏర్పాటుచేశారు. ఇంత ఖర్చు చేయడానికి ఆయనకు ధైర్యం రావడానికి కారణముందట. చిత్ర కథానాయకుడు విజయ్ వస్తాడు కాబట్టే సీన్ స్టార్ హోటల్ కు మారిందని చిత్ర సంబంధికులు అన్నారు. కానీ దిల్ రాజు లెక్క తప్పింది విజయ్ హ్యాండిచ్చాడు. ఆయన రాలేదు. విజయ్ కు తెలుగు మార్కెట్ తక్కువ. తన డబ్బింగ్ సినిమాల ప్రమోషన్ కోసం తక్కువగా వస్తుంటారు. గతంలో శంకర్ తీసిన స్నేహితులు ప్రమోషన్ లో కనిపించారు. మళ్లీ పోలీసోడు కు వస్తాడనుకుంటే రాలేదు. చిత్ర నాయిక సమంత, దర్శకుడు అట్లీ మాత్రం విచ్చేసి సినిమా గురించి చెప్పారు. సినిమా రిలీజ్ కు మరికొంత సమయం ఉంది కాబట్టి విజయ్ ను మళ్లీ పిలిపిస్తారా అనేది చూడాలి.