సర్దార్... రిలీజైన మూడు రోజులకు పవర్ స్టార్ మీడియా ముందుకొచ్చారు. ఎంపికచేసుకున్న కొందరికే ఇంటర్య్వూలు ఇచ్చారు. సినిమా భజన కోసం ఒకరిని, రాజకీయ విశ్లేషణ కోసం మరొకరిని పిలిచారు.
ఎన్టీవి ఛానల్ సర్దార్... చిత్ర ప్రమోషన్ కోసం ఉపయోగపడే ప్రశ్నలే వేసింది. యాంకర్స్ ఇద్దరు పవన్ కు చిడతలు కొట్టారని చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ ఇంటర్య్వూ అంటే వీక్షకులు ఎక్కువ ఆశిస్తారు. ఈ విషయం మరిచిన ఎన్టీవీ సర్దార్... చిత్రానికి భజనకే ప్రాధాన్యతనిచ్చిందని మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఎన్టీవీలో సర్దార్... చిత్ర నిర్మాత శరద్ మరార్ సి.ఈ.ఓ.గా కొంతకాలం పనిచేసి ఉన్నారు. అందుకే ఇంటర్య్వూ ఏకపక్షంగా మారిందనే అనుమానం కలుగుతోంది.
ఇక చాలాకాలం తర్వాత టీవీ 9 తరుపున రవిప్రకాష్ కనిపించారు. ఆయన పవన్ ని ఇంటర్య్వూ చేశారు. ఎవరినైనా తమ స్టూడియోకే పిలిపించుకునే రవిప్రకాష్ తానే పవన్ దగ్గరకు వెళ్ళారు. తన అనుభవంతో పవన్ కల్యాణ్ నుండి జనానికి కావాల్సిన సమాధానాలను ఇప్పించారనుకోవచ్చు. జనసేన పార్టీ గురించి, చిరంజీవి గురించి, బిజేపి, ఇంకా రోహిత్ ఆత్మహత్య, కాపుల రిజర్వేషన్లు, అసహనం, వర్మ ఇలా అనేక విషయాలను సూటిగా ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. పవన్ సైతం ఎక్కడా తడుముకోకుండా జవాబులు చెప్పారు. ఆయన కూడా తనపై వినిపిస్తున్న అనేక విమర్శలకు జవాబివ్వాలని ఎదురుచూస్తున్నట్టు అనిపించింది. ఒకే సమయంలో ఈ ఇంటర్యూలు ప్రసారం కావడం విశేషం.