ఎంతోకాలంగా టాలీవుడ్ స్టార్స్ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నారు అనే విమర్శ ఉండేది. వాస్తవానికి నేల విడిచి సాము చేసినప్పుడు కాకుండా తాము అనుకున్న వైవిధ్యాన్ని జనరంజకంగా చూపించినప్పుడు ఆయా చిత్రాలు బాగానే ఆడటమే కాకుండా ఆయా హీరోల అభిమానాన్ని కూడా చూరగొన్నాయి. ఈ విషయంలో స్టార్స్‌తోపాటు వారి అభిమానులు కూడా మారుతున్నారు. సీనియర్‌స్టార్స్ విషయానికి వస్తే తన ఇమేజ్‌ను పక్కనపెట్టి చిరంజీవి చేసిన 'రుద్రవీణ, ఆరాధన, స్వయంకృషి, ఆపద్బాంధవుడు, శ్రీమంజునాధ' వంటి అద్భుత చిత్రాలను ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకోవడంతో పాటు ఆయన కెరీర్‌లోనే ఈ చిత్రాలు మరపురానివిగా మిగిలిపోయాయి. ఇక బాలకృష్ణ విషయంలో ఇమేజ్‌కు దూరంగా ఆయన చేసిన 'ఆదిత్య 369, భైరవద్వీపం' వంటి చిత్రాలు బాగానే ఆడాయి. ఇక నాగ్ తన కెరీర్‌లో ప్రతిసారి ఏదో వెరైటీ చేయాలని భావించినప్పుడు ఆయన అభిమానులు, వెంకీ కూడా తన ఇమేజ్‌ను పక్కన పెట్టి చేసిన చిత్రాలను ఆయన ఫ్యాన్స్ కూడా బాగానే ఆదరించారు.
తాజాగా మన యంగ్ స్టార్స్ కూడా ఇప్పుడు కథే కింగ్ అని నమ్ముతున్నారు. తమ ఇమేజ్‌ను పక్కనపెట్టి కొత్తగా ఆలోచిస్తున్నారు. దీనికి ఉగాదినాడు విడుదలైన 'బ్రహ్మోత్సవం' కొత్త పోస్టరే మంచి ఉదాహరణ. వాస్తవానికి ఎవరికో చెప్పులు తొడుగుతూ మోకాళ్లపై ఉన్న మహేష్ పోస్టర్‌ని చూసి ఆయన అభిమానులకు కోపం రావాలి. కానీ ఈ పోస్టర్‌తో ఈచిత్రం అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఇటీవలి కాలంలో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో' చిత్రాల టైటిల్స్ విషయంలోనే కాదు.. ఆయా సినిమాల్లో స్టార్‌ల కంటే వారి తండ్రుల పాత్రలే బాగా హైలైట్ అయ్యాయి. దానికి కూడా మన అభిమానులు బాగానే స్పందించారు. ఇక రామ్‌చరణ్ ప్రస్తుతం చేస్తున్న తమిళ రీమేక్ 'తని ఒరువన్' చిత్రంలో కూడా హీరో కంటే విలన్ పాత్రకే ప్రాధాన్యం ఎక్కువ. తమిళంలో హీరో పాత్రను పెద్దగా ఇమేజ్ లేని జయం రవి చేశాడు. కానీ ఆ పాత్రను చేయడానికి రామ్‌చరణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ చేస్తుండటం, తమిళ వెర్షన్‌కు పెద్దగా మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లు తీస్తున్నారని సమాచారం. ఇదే నిజమైతే రామ్‌చరణ్‌ను కూడా అభినందించాల్సిందే...!