ప్యామిలీ ప్లస్ కామెడీ అనేది వెంకీ బలమైన ఆయుధం. శోభన్‌బాబు తర్వాత మరలా అంతటి ప్యామిలీ ఫాలోయింగ్ ఉన్న హీరో వెంకటేష్ మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఆయన నటిస్తున్న 'బాబు బంగారం' లుక్ అదరగొట్టింది. మరలా మునుపటి వెంకీలా ఆయన లుక్ ఎంతో ఇంప్రెసివ్‌గా ఉంది. గత కొంతకాలంగా వెంకీ తన రూట్‌ను వదిలేశాడు. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం, గోపాల గోపాల' వంటి చిత్రాలలో ఆయన చేసినవన్నీ సీరియస్ క్యారెక్టర్లే కావడం విశేషం. కానీ మారుతి పుణ్యమా అని మరోసారి వెంకీ తన ఫ్యామిలీ ప్లస్ కామెడీ రూట్‌లోకి వెళ్తున్నాడు. 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో రెండున్నర గంటల పాటు నవ్వించిన మారుతి ఇప్పుడు అదే రూట్‌ను ఫాలో అవుతున్నాడు. ఈ చిత్రంలో హాస్యాన్ని పండించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. పోలీస్ అనగానే 'ఘర్షణ'లాంటి సీరియస్ పోలీస్ కాదు సుమా...! కాగా ఇలా ఫ్యామిలీ విత్ కామెడీ చిత్రం చేసి వెంకీ చాలా కాలం అయింది. అప్పుడెప్పుడో వచ్చిన 'ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే' తర్వాత వెంకీ ఫ్యామిలీ విత్ కామెడీని కలిసి చేస్తున్న చిత్రం కావడంతో ఈ 'బాబు బంగారం'పై అందరికీ ఎంతో నమ్మకం ఉంది, నాగ్‌కు 'సోగ్గాడే చిన్నినాయనా'లా ఈ 'బాబు బంగారం' వెంకీకి బలమైన సోలో హిట్‌ను అందిస్తుందనే నమ్మకంతో నిర్మాతతో పాటు వెంకీ అభిమానులు కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. మరి మారుతి ఈ విషయంలో వెంకీకి ఎలాంటి హిట్‌ను అందించనున్నాడో వేచిచూడాల్సివుంది...!