దర్శకుడు సుకుమార్ క్రియేటివిటీకి హద్దే లేకుండా పోతోంది. ఈయన తీసే చిత్రాలు సామాన్యప్రేక్షకులకు అర్ధం కావనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు కామన్ ఆడియెన్స్. సినిమా అన్న తర్వాత అది కేవలం మేధావులను., ఓవర్‌సీస్, ఎ సెంటర్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ మాత్రమే కాదని, సాధారణ ప్రేక్షకులకు, ముఖ్యంగా మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ అభిమానుల చేత కూడా చప్పట్లు కొట్టించాలనే విషయం సుక్కు తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు. కాగా సుక్కు తాను చేసే ప్రతి చిత్రం విడుదలకు ముందు అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం అని చెబుతూనే ఉన్నా...చివరకు థియేటర్‌కు వెళ్లితే.. మాత్రం సుక్కు ప్రేక్షకులకు ఐక్యూ టెస్ట్‌లు, బుర్రకు పదును పెట్టడం మాత్రం మానలేదు అనే విషయాన్ని '1' (నేనొక్కడినే), 'నాన్నకు ప్రేమతో' చిత్రాలు నిరూపించాయి. ఈ రెండు చిత్రాలలో ఒకటి డిజాస్టర్ కాగా మరోటి ఓ మోస్తారు హిట్ గా నిలిచింది. తాజాగా సుక్కు.. తాను రామ్‌చరణ్‌తో చేయబోయే చిత్రంలో ఎలాంటి ఐక్యూ టెస్ట్‌లు ఉండవని, అందరికీ నచ్చే ఓ మంచి లవ్‌స్టోరీ తీస్తానంటున్నాడు. మరి చరణ్ కోసమైనా సుక్కు మారతాడా? లేక తన దారిలోనే వెళ్లి మరోసారి తన మాటలను తీసి గట్టుమీద పెడతాడో వేచిచూడాల్సివుంది.