'మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి' చిత్రాలతో మంచి ఊపుమీదున్న సీనియర్‌స్టార్ కింగ్ నాగార్జున త్వరలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఓం నమో వేంకటేశాయ' అనే భక్తిరస చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. 17వశతాబ్దంలో తిరుమల వేంకటేశ్వస్వామికి ప్రియభక్తునిగా కీర్తి పొందిన హథీరామ్‌బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా గతంలో 'అన్నమయ్య' చిత్రం కోసం ఆయన కాలంనాటి పరిస్ధితులను ప్రతిబింబించేలా కేరళ అడవుల్లో ఎక్కువభాగం షూటింగ్‌ను జరిపిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ తాజా చిత్రానికి సంబంధించిన 17వ శతాబ్దంనాటి కాలమాన పరిస్థితులను ప్రతిబింబించేలా చేయడం కోసం ఈ చిత్ర బృందం ఇటీవల కేరళ, కర్ణాటక రాష్ట్రాలలోని పలు ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. చివరకు దక్షిణ కర్ణాటకలోని చిక్ మంగుళూర్ అడవుల్లో కొన్ని ప్రదేశాలను ఎంపిక చేశారని సమాచారం. బాగా శీతల ప్రాంతమైన ఈ అడవులలో 17వ శతాబ్దానికి చెందిన తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని ప్రతిబింబించేలా భారీ సెట్స్ వేయనున్నారు. అక్కడే ఈ చిత్రంలోని అత్యధిక భాగాన్ని తెరకెక్కించనున్నారు. కాగా ఈ చిత్రానికి జె.కె.భారవి రచనలో పూర్తిగా లీనమైపోగా, ఇందులో కూడా వేంకటేశ్వరస్వామిగా మరోసారి సుమన్ నటించనున్నాడని సమాచారం.