పొలిటికల్ జర్నలిజంలో విలువలు మంటకలిశాయి. వ్యక్తిగత వ్యతిరేకం రాతల్లో చూపిస్తున్నారు. వెంటపడి వేటాడుతున్నట్టు తోచింది రాస్తున్నారు. తెలుగు దినపత్రికలు తలా ఒక పార్టీకి కొమ్ముకాస్తున్నాయనే విషయం తెలిసిందే. ప్రభుత్వ పాలసీలను విమర్శించే ముందు సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఆంధ్రలో చంద్రబాబుపై సాక్షి నిప్పులు చెరిగితే, తెలంగాణలో ఆంధ్రజ్యోతి తెరాస ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించేది. కానీ ఇప్పుడు జ్యోతి కూడా ప్లేట్ ఫిరాయించినట్టు కనిపిస్తుంది. రెండు రోజుల క్రితం కెసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు జ్యోతి ఆఫీసుకువెళ్లి పత్రికను పొగిడేశారు. జ్యోతి నిజాలు రాస్తుందని సర్టిఫికెట్ ఇచ్చేశారు. అంటే ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంపై జ్యోతి రాసిన రాతలు నిజమే అని ప్రజలు నమ్మాలా అనేది హరీష్ చెప్పాలి. ఎందుకంటే జ్యోతిపై పలు సందర్భాల్లో అది ఆంధ్రా వాయిస్ అని కేసీర్, కవిత ఆరోపించారు.
ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణకు, కేసీర్ కు వ్యక్తిగత స్నేహం ఉంది. కారణాలు ఏమైనా తెరాస ప్రభుత్వం వచ్చాక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పై నిషేదం కొనసాగుతోంది. ఇది కేసీఆర్ పనే అని వేమూరి పెన్నుకు పదును పెట్టి ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించసాగారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి విషయాలను కూడా తిరగదోడారు. కానీ ఇది కొంతకాలమే జరిగింది. కేసీఆర్ చండియాగం చేసినప్పుడు వేమూరి వెళ్ళారు. అక్కడ ఇద్దరి మధ్య కాంప్రమైజ్ జరిగిందని మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. అది నిజమే అన్నట్టు జ్యోతి రాతలు కూాడా మారాయి. తాజాగా హరీశ్ సైతం దీన్ని బలపర్చే విధంగా మాట్లాడారు. జ్యోతిలో ప్రభుత్వ ప్రకటనల సంఖ్య కూడా పెరగడం చూస్తుంటే వేమూరి ఫ్లేట్ ఫిరాయించినట్టు స్పష్టమవుతోంది. మీడియా అధినేతలకు సమయానుకూలంగా పాలసీలు మారుతుంటాయనడానికి ఇది తాజా ఉదాహారణ. త్వరలో వై.యస్. జగన్ తో కూడా వేమూరి రాధాకృష్ణ కాంప్రమైజ్ అయితే ఆశ్చర్యం లేదు.