అవకాశం, అనుకూలం, లాభం ఉంటే చాలా అల్లు అరవింద్ స్కెచ్ వేస్తారు. అకస్మాత్తుగా ఆయనకు వైజాగ్ పై ప్రేమ పుట్టుకువచ్చింది. చిత్ర పరిశ్రమ అభివృద్దికి వైజాగ్ అనువైన ప్రాంతమని తెలిసివచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమను వైజాగ్ లో డెవలప్ చేయాలనే ఆలోచనా వచ్చింది. వెంటనే పావులు కదిపారు. తన పాత మిత్రుడు ప్రజారాజ్యం దోస్త్, ప్రస్తుత తెదేపా మంత్రి గంట శ్రీనివాసరావుతో చేతులు కలిపారు. 10న వైజాగ్ లో జరిపే సరైనోడు వేడుకలో మంత్రిని కూడా ఇన్ వాల్వ్ చేసి ఆయన చేతనే వైజాగ్ లో పరిశ్రమ డెవలప్ కావాలని చెప్పించారు. స్థలాలిస్తే రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టూడియోలు కడతారట. అవి కడితేనే షూటింగ్ లు జరుగుతాయట. వైజాగ్ లో ఇప్పటికే రామానాయుడు స్టూడియో ఉంది. దానివైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదు. నిజానికి వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ లకు అనువైన ప్రదేశం. ఇప్పటికి వేలాది సినిమాల చిత్రీకరణ జరిగింది. అరవింద్ మాత్రం తన సినిమాల కోసం విదేశాలపై ఆధారపడతారు కానీ వైజాగ్ కోసం ఆలోచించిన దాఖలాలు లేవు. అకస్మాత్తుగా వైజాగ్ పై ప్రేమ పుట్టుకరావడానికి కారణం ఏమై ఉంటుందని సినీ వర్గాలు ఆలోచిస్తున్నాయి. దీనికి రాజకీయ రంగును కూడా పులుముతున్నాయి. చిరంజీవి కూతురు పెళ్లి బెంగుళూరులో చేశారు. రిసెప్షన్ హైదరాబాద్ లో చేశారు. అప్పుడు వైజాగ్ గుర్తుకురాలేదు. వ్యక్తిగతానికి పనికిరాని వైజాగ్ ను, స్థలాలిస్తే మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారట. ఇప్పటి వరకు అల్లు అండ్ కొణదెల కుటుంబాలు హైదారాబాద్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ఏం చేశాయి. కనీసం రికార్డింగ్ థియేటర్ కూడా కట్టలేదనే విషయాన్ని పలువురు నిర్మాతలు గుర్తుచేస్తున్నారు.
ఈ పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు వైపు అరవింద్ మెుగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. మరో రెండేళ్లలో చిరు రాజ్యసభ సభ్యత్వం ముగుస్తుంది. ఆ తర్వాత రాజకీయంగా ఆయన భవిష్యత్తు శూన్యమే. కాపు సామాజిక వర్గానికి చెందిన వీరంతా రాజకీయనీడ కోసం ఎదురుచూస్తున్నారు. పరిశ్రమ డెవలప్ పేరుతో చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు అనుమానిస్తున్నాయి.