ఒక సినిమా వేడుకకు కోటి రూపాయలు ఖర్చు అవుతుందా అంటే అందరు ముక్కున వేలేసుకోవాల్సిందే. అల్లు అర్జున్ నటిస్తున్న 'సరైనోడు' వేడుకను ఈనెల 10న వైజాగ్ లో నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఆల్ ఫూల్స్ డే నాడు పాటలను సాదాసీదాగా రిలీజ్ చేసి, ఆడియో సక్సెస్ మీట్ అంటూ వైజాగ్ లో హడావుడి చేయనున్నారు. దీని కోసం కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ మీడియా ప్లానర్స్ చెప్పుకొచ్చారు. 'సరైనోడు'కు అల్లు అరవింద్ నిర్మాత. ఆయన వ్యవహారం తెలిసిన ఎవరైనా కోటి ఖర్చు అనేది ప్రచారపు ఎత్తుగడ అని కొట్టిపారేస్తారు. నిర్మాతల్లో అరవింద్ గారి స్టైలే వేరు. వ్యాపారంలో మెళకువలను అవపాసన పట్టిన వ్యక్తి. ఆయన తీసే చిత్రాలను స్టూడియో మేకింగ్ చిత్రాలంటారు. అంటే స్టూడియోల్లో, ప్రయివేట్ భవంతుల్లో మాత్రమే షూటింగ్ చేస్తారు. ప్రత్యేకంగా సెట్స్ వేయరు. బావ చిరంజీవితో కూడా ఇదే తరహాలో తీశారాయన. స్టార్స్ తో బిజినెస్ చేయాలి ఖర్చు పెట్టకూడదు అనేది అల్లువారి సిద్దాంతం. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ తో తీసిన చిత్రాలన్నీ ఇతర నిర్మాతలు చేసినవే. సరిగ్గా చిరంజీవికి తిరుగులేని మార్కెట్ ఉన్నపుడు మాత్రమే అరవింద్ సినిమా ప్లాన్ చేసేవారు. అది కూడా పరిమిత ఖర్చుతోనే. ఇలాంటి తెలివైన నిర్మాత 'సరైనోడు' కోసం కోటి ఖర్చు పెట్టి వేడుక నిర్వహించడం అంటే నమ్మశక్యంకాని నిజంగానే భావించాలి. ఎందుకంటే ఆల్ ఫూల్స్ రోజునే ఈ న్యూస్ ను సదరు మీడియా ప్లానర్స్ రిలీజ్ చేశారు.
'సరైనోడు' చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో అరవింద్ కు బాగా తెలుసు. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయడానికి ఆయన రంగం సిద్దం చేసుకున్నారు. 'సర్దార్ గబ్బర్ సింగ్' ప్రభావం లేకుండా ఉండేందుకు రెండు వారాల తర్వాత అంటే ఏప్రిల్ 22న రిలీజ్ ప్లాన్ చేశారు. అప్పటికి 'సర్దార్...' హడావుడి తగ్గుతుందని అరవింద్ అంచనా వేశారు. అయితే పవన్ అభిమానులు మాత్రం 'సర్దార్..' రికార్డులు నెలకొల్పాలని ఆశిస్తున్నారు. కనీసం రెండు వందల యాభై కేంద్రాల్లో యాభై రోజుల ప్రదర్శన జరుగుతుందని వారు అంచనావేస్తున్నారు. మరి ఏ నమ్మకంతో 'సర్దార్ ...' రిలీజైన రెండు వారాలకే థియేటర్లు ఖాళీ అవుతాయని, అందుకే 'సరైనోడు' చిత్రాన్ని రెండు వారాల తర్వాత రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇంత ముందు చూపున్న అల్లువారిని అభినందించాల్సిందే. ఈ విషయంలో పవన్ అభిమానుల రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో చూడాలి.