మన టాలీవుడ్ స్టార్స్ అంతా సినిమా సినిమాకు వేరియేషన్స్ కావాలని కోరుకుంటున్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని తపనపడుతున్నారు. ఇప్పటికే సీనియర్ స్టార్స్ అయిన నాగార్జున, వెంకటేష్‌లు ఈ దారిలోనే నడుస్తున్నారు. ఇక బాలయ్య కూడా క్రిష్‌తో చేయనున్న తన 100వ చిత్రం, ఆ తర్వాత చేయబోయే సింగీతం శ్రీనివాసరావు చిత్రాలను కూడా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక పవన్‌కళ్యాణ్ విషయానికి వస్తే 'గబ్బర్‌సింగ్'లో హైఓల్టెజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేశాడు. 'కెమెరామెన్ రాంబాబు' చిత్రంలో సోషల్ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 'గోపాల గోపాల' చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్రను పోషించి మెప్పించాడు. 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఫ్యామిలీ సెంటిమెంట్, రాబోయే 'సర్దార్‌గబ్బర్‌సింగ్'లో మరోసారి హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఇక మూసచిత్రాలు చేస్తాడనే చెడ్డపేరు ఉన్న రామ్‌చరణ్ కూడా 'గోవిందుడు అందరివాడేలే' తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. తాజాగా 'తని ఒరువన్' కూడా ఓ మంచి వైవిధ్యమైన చిత్రమే. దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో ఆయన చేయబోయే చిత్రం పక్కా క్లాస్ చిత్రం అని తెలుస్తోంది, మహేష్‌బాబు విషయానికి వస్తే '1'(నేనొక్కడినే) చిత్రంతో భారీ సాహసమే చేశాడు. 'ఆగడు'ను పక్కా మాస్ చిత్రంగా, 'శ్రీమంతుడు' చిత్రాన్ని మంచి మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌గా చూసుకున్నాడు. మరలా 'బ్రహ్మూెత్సవం' చిత్రంతో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె' చిత్రంలాగా మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకొని సినిమా చేస్తున్నాడు. ఇక బన్నీ విషయానికి వస్తే 'రేసుగుర్రం'తో కామెడీ ఎంటర్‌టైనర్, 'సన్నాఫ్ సత్యమూర్తి'తో ఫ్యామిలీ సెంటిమెంట్, 'రుద్రమదేవి'లో రౌద్రరసం, తాజాగా 'సరైనోడు'లో పక్కా యాక్షన్ అండ్ మాస్ చిత్రం చేస్తున్నాడు. ఎన్టీఆర్ విషయానికి వస్తే 'టెంపర్'లో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా, 'నాన్నకు ప్రేమతో' చిత్రాన్ని చేసి తన గట్స్‌ను చూపించాడు. తాజాగా కొరటాల దర్శకత్వంలో ఆయన చేస్తున్న పాత్ర పక్కా మాస్‌తో పాటు యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. ఇక ప్రభాస్ 'మిర్చి' తర్వాత 'బాహుబలి', వీటి తర్వాత సుజీత్ దర్శకత్వంలో కామెడీ బేస్‌గా సాగే పోలీసు పాత్ర, 'జిల్' రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో క్యూట్ లవ్‌స్టోరీ చేయనున్నాడు. ఇలా మొత్తానికి మన స్టార్ హీరోలు ఇప్పుడు తమ తప్పును తెలుసుకొని మూస చిత్రాలకు నో చెబుతూ, వైవిధ్యచిత్రాలకు పెద్దపీట వేయడం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.