ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటవ తేదీని ఆల్ ఫూల్స్ డే అంటారు. ఆరోజు సరదాగా ఒకరికి ఒకరు నమ్మశక్యం కాని విషయాలు చెప్పి, నిజమని నమ్మించి ఫూల్స్ చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆరోజే పాటలను నేరుగా మార్కెట్లో విడుదల చేస్తున్నారు సరైనోడు నిర్మాత. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం పాటలను ఎలాంటి హడావుడి లేకుండా రిలీజ్ చేయడంలో మరొక ఉద్దేశం కూడా ఉందని యూనిట్ సభ్యులు అంటున్నారు. గతవారం పవన్ కల్యాణ్ సర్దార్... పాటలు అట్టహాసంగా రిలీజ్ అయ్యాయి. చిరంజీవి అతిథిగా హాజరై తమ్ముడు పవన్ ని పొగిడేశారు. సర్దార్.. ఆడియో హడావుడిని అభిమానులు ఇంకా మర్చిపోలేదు. ఆ మత్తులో ఉన్నపుడు సరైనోడు ఆడియో వేడుకని నిర్వహిస్తే ఆశించిన మైలేజ్ రాదని గ్రహించిన అల్లు అరవింద్ ముందుగానే జాగ్రత్తపడ్డారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. నిజానికి స్టార్ హీరో ఆడియో వేడుకని నిర్వహిస్తే నిర్మాతకు ఆదాయం కూడా వస్తుంది. అయినప్పటికీ వదులుకుని సరైనోడు పాటలను నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు. మరో విషయం కూడా ఉందట. సర్దార్.. వేడుకను చిరంజీవి హాజరయ్యారు కాబట్టి సరైనోడు వేడుక నిర్వహిస్తే దానికి చిరంజీవిని పిలవడానికి ఇబ్బంది. పవన్ ని పొగిడిన నోటితోనే అల్లు అర్జున్ ని కూడా పొగిడితే పవన్ అభిమానులు హర్ట్ అవుతారు. అలాగే చిరుకు మేనల్లుడి కంటే తమ్ముడే ఎక్కువ. పైగా పవన్ తో ఏర్పడిన సాన్నిహిత్యాన్ని మళ్లీ దూరం చేసుకోవడానికి చిరుకు ఇష్టం లేదు. ఈ విషయాలన్ని గ్రహించే సరైనోడు పాటల వేడుకకు బై బై చెప్పేసి, ప్రీ రిలీజ్ వేడుకకు ప్లాన్ చేశారు. హైదరాబాద్ లో సర్దార్... వేడుక జరిగింది కాబట్టి సరైనోడు వేడుకకు వైజాగ్ ను వేదికగా ఎంపికచేశారు. ఇదండి అల్లు అరవింద్ ముందుచూపు.