రాజకీయాల్లో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చాలి. నటిగా అనేక చిత్రాల్లో నటించిన ఫైర్ బ్రాండ్ రోజాకి ఈ విషయం బాగా తెలుసు. అందుకే చంద్రబాబును ఎదుర్కోవడానికి అవకాశం ఉన్న మార్గాలన్నింటిని ఉపయోగించుకుంటోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా రోజా జూనియర్ ఎన్టీఆర్ ను పావుగా వాడుతోంది. 2009 ఎన్నికల్లో జూనియర్ ను ప్రచారానికి ఉపయోగించుకుని, నారా లోకేష్ కోసం ఇప్పుడు పక్కన పెట్టేశారని కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చింది. దీనివల్ల ఎన్టీఆర్ కుటుంబంలో లుకలుకలు వస్తాయని, అవి చంద్రబాబుపై ప్రభావం చూపిస్తాయనేది రోజా ఆలోచనలా కనిపిస్తోంది. అలాగే భవిష్యత్తులో జూనియర్ ను.. వై.యస్. జగన్ వైపు ఆకర్షించేలా ఇప్పటి నుండే రోజా పావులు కదుపుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏ కారణం చేతనైనా నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. టిడిపి నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటే వారు జగన్ కు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందనేది రోజా వ్యూహం. మహానటుడు ఎన్టీఆర్ కుటుంబం అండ చంద్రబాబుకు లేకుండా చేస్తే 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు సులభం అవుతుందనే ఎత్తుగడ కూడా ఇందులో కనిపిస్తోందని ఆ వర్గాలు అనుమానిస్తున్నాయి. రోజా ఆరోపణలను నందమూరి ఫ్యామిలీ ఖండించలేదు. టిడిపి నుండి కూడా స్పందన లేదు. చూద్దాం మున్ముందు ఏం జరుగుతుందో?