ఇంట గెలిచి రచ్చ గెలవమన్న పెద్దల మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నాడు తమిళ హీరో కార్తీ. ముందుగా సొంత పరిశ్రమ కోలీవుడులో ఘనవిజయాల్ని అందుకొని మెళ్ళిగా తమిళం నుండి తెలుగుకు అనువాదం అయిన చిత్రాల ద్వారా ఇక్కడ కూడా మంచి పేరును సంపాదించాడు కార్తీ. అన్నయ్య సూర్యా చూపిన అడుగుజాడల్లో మొన్నటి వరకు నడిచినా ఇప్పుడు మాత్రం కార్తీ నిజంగానే అన్నయ్యను మించిపోయాడు. ఎందుకంటే ఎన్నాళ్ళుగానో ఎందఱో తమిళ హీరోలు డైరెక్ట్ తెలుగు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో హిట్టు కొట్టాలని ఆశపడి అటు తరువాత భంగపడ్డా కార్తీ మాత్రం ఎంచక్కా ఊపిరి చిత్రంతో ఎవరికీ నెరవేరని కోరికని తనదైన శైలిలో తీర్చేసుకున్నాడు. ఊపిరిలో నాగార్జున పాత్రకు లభించినంత ఆదరణ కార్తీ పాత్రకు కూడా దక్కింది. సినిమా మొదటి సగం మొత్తం కార్తీ కామెడీ టైమింగ్ మీదే నడిచింది అంటే అతిశయోక్తి కాదేమో. తమిళంలో అరకొరగా నడుస్తున్న తొజని మించిన అద్భుత విజయం కార్తీకి ఊపిరితో తెలుగులో రావడం ఎనలేని అదృష్టంగా భావించవచ్చు. అందుకేనేమో ఇప్పుడు సూర్యా కూడా జూనియర్ ఎన్టీయార్, రాజమౌళి కలయికలో రానున్న ఓ సెన్సేషనల్ సినిమా ద్వారా డైరెక్ట్ తెలుగులో బోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు.