మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీయాలా లేక సినిమాలు తీస్తూ తీస్తూ పోతుంటే ప్రేక్షకుల అభిరుచులు వాటంతట అవే మారుతాయా? కొత్తగా ఏదైనా ప్రయత్నం చేసి విఫలమైన దర్శకులనో లేక అసలు కొత్తదనం, ప్రయత్నం అనే పదాలకు అర్థమే తెలియని హీరోలనో అడిగితే పై ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. కానీ తెలుగు సినిమా అతిని, గతిని మార్చడానికే నేనున్నది అన్న తరహాలో సినిమా సినిమాకు భిన్నమైన అభిరుచి గల కథలను, పాత్రలను ఎంచుకుంటూ, నటుడిగా ఎదగడానికి ఎటువంటి పరిధులు ఉండవు అని చాటి చెప్పుతున్న అక్కినేని నాగార్జున లాంటి హీరోని మనం ఎంత పొగిడినా తక్కువే అవుతుందేమో. అప్పట్లో శివ నుండి ఇప్పటి ఊపిరి వరకు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ పోకడలను మలుపు తిప్పుతూనే ఉన్నారు. వినూత్నంగా అటెంప్ట్ చేసిన ప్రతిసారీ లక్ష్మీదేవి కటాక్షం ఉండకపోవచ్చు బట్ ఆ అటెంప్ట్ పుణ్యమాని మరికొంత మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు నూతన పంథాను అనుసరిస్తే ప్రేక్షకుల నుండి కటాక్షం మాత్రం ఖచ్చితంగా దానంతట అదే వస్తుంది అని నమ్మే నాగార్జున గారి మొండి ధైర్యమే ఈరోజు మారోసారి ఊపిరిగా మన ముందుకు వచ్చింది. ఫ్రెంచ్ సినిమా ద ఇన్టచేబుల్స్ తెలుగు రీమేకుకు దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీకారం చుట్టిననాటి నుండి సినిమా మీద సంశయాలు పెరుగుతూ పోయాయి. పైగా నాగార్జునని సినిమా సాంతం ఓ కుర్చీలో కూలబడిపోయిన పేషెంటులాగా చూపడం ఎవరికి మాత్రం నచ్చుతుంది అనుకున్నాం. ఈ రోజు ఆ అనుమాలన్ని పటాపంచలు చేస్తూ నటుడికి నటించడం ఒక్కటి వస్తే చాలు, కాళ్ళు చేతులు లేకపోయినా కళ్ళతో కూడా పాత్రలో జీవించగలడు అనే మాటను సత్యం చేస్తూ విక్రమాదిత్య పాత్రకు ప్రాణం పోశారు నాగార్జున. ఒక్క మాటలో చెప్పాలంటే, నాగార్జున గారు తప్ప ఈ పాత్రకు ఇంకెవరు న్యాయం చేయలేరు అనే స్థాయిలో ఇమిడిపోయారు. ఒకప్పటి మాసాలా చిత్రాలను ఆదరించిన మన ప్రేక్షకులే ఈరోజు ఊపిరికి బాక్సాఫీస్ దగ్గర ఊపిరి పోస్తున్నారంటే అది కేవలం నాగార్జున గారి లాంటి గొప్పనటులు ఉండడం వలనే సాధ్యమయింది. అందుకే నాగార్జున గారిని కలిస్తే మొదటగా మేము అడగాలనుకున్న ప్రశ్న, సర్... ఊపిరి తెలుగు సినిమా లెక్కలకు అనుగుణంగానే ఉందా లేక మేమే ఏదైనా తప్పుగా చూస్తున్నామా? చిత్రపరిశ్రమ ఎదుగుదలకు బాక్సాఫీస్ కనకవర్షం ఒక్కటే కొలమానం కాదు, ఎంచుకున్న ఏ కొద్దిమంది ప్రేక్షకుల మనసులను స్పృశించినా అది దిగ్విజయమే. రీమేక్ అంటే కష్టమేమో, అందునా పరదేశీ కథకు తెలుగు రీమేక్ అంటే మరీ సంక్లిష్టమేమో అన్న అనుమానం నుండి ఆ పాత కథకు కొత్తగా భలే ఊపిరి పోసారే అని అందరూ పొగడడమే PVP వారికీ, దర్శకుడు వంశీకి, నటీనటవర్గానికి నిజమైన విక్టరీ.