దర్శకరత్న దాసరి నారాయణరావుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తున్నాడని.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసిన ఓ దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నాడని మాటలు వినిపించాయి. ఈ సినిమా గురించి సంవత్సర కాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నా.. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. రీసెంట్ గా పవన్ కళ్యాన్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై స్పందించి కథ రెడీ అయితే దాసరి గారితో సినిమా చేస్తానని చెప్పాడు. అయితే పవన్ మరో రెండు, మూడు సినిమాలు చేసి ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పాడు. ఈ క్రమంలో ముందుగా ఎస్.జె.సూర్యతో ఒక సినిమా, అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తోంది. మరి దాసరి సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది.