కంగనారౌనత్.. ఆమె ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆమెపై విపరీతమైన విమర్శలు వచ్చాయి. నటన చేతకాదని, మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ కనిపించవనీ, హీరోయిన్ కావడానికి ఉండాల్సిన ఏ లక్షణం ఆమెకులేవని విమర్శకులు ఆమెపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా ఆమె కూడా హీరోయిన్‌గా బ్రేక్ రావడం కోసం ఎంతోకాలం, ఎన్నో సినిమాలతో చకోరపక్షిలా ఎదురుచూసింది. చిట్టచివరకు ఆమెకు 'ప్యాషన్' చిత్రంలో మంచి అవకాశం లభించింది. ఈ చిత్రం ఆమెకు ఉత్తమ సహాయనటిగా జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత ఇక ఆమె సినిమా సినిమాకు తన నటనను మెరుగులు దిద్దుకొంటూ వచ్చింది. ఓవర్‌నైట్ స్టార్ అయిన హీరోయిన్ కాదామె. ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు, విమర్శలు ఎదుర్కొని ఆపై తన సత్తా చాటింది. కాగా 2014లో వచ్చిన 'క్వీన్' చిత్రంతో ఆమె దశ తిరిగింది. ఈ చిత్రానికి గాను ఆమెకు ఉత్తమనటిగా జాతీయఅవార్డు లభించింది. తాజాగా ఆమె నటించిన 'తను వెడ్స్‌మను రిటర్న్స్' చిత్రం ద్వారా ఆమె ఈసారి కూడా ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందింది. ఇలా వరుసగా రెండేళ్లు ఆమె ఉత్తమ జాతీయనటిగా అవార్డులు సాధించడంతో ఇప్పడు అందరు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తనను విమర్శించిన వారి నోళ్లు మూయించి తానేమిటో నిరూపించుకొని ఇప్పుడు అందరిచేతా ఆహా..ఓహో అంటూ ప్రశంసలను అందుకుంటోంది కంగనారౌనత్.