వెండితెర అద్భుతం 'బాహుబలి' చిత్రం. ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్‌లు అన్నీఇన్నీ కావు. వాటిని బద్దలు కొట్టడం సామాన్యమైన విషయం కాదు. అయితే కోలీవుడ్ స్టార్ విజయ్ మాత్రం తన 'తేరీ' చిత్రంతో ఓ 'బాహుబలి' రికార్డును బద్దలు కొట్డాడు. 'బాహుబలి' ట్రైలర్ 24గంటల్లో 1.2 మిలియన్ల మంది చూస్తే, ఇప్పుడు విజయ్ తాజా చిత్రం 'తేరీ' ట్రైలర్ కేవలం 22 గంటల్లోనే ఈ రికార్డును బద్దలుకొట్టింది. దీంతో అందరూ షాక్ తింటున్నారు. ఈ వరస చూస్తుంటే చిత్రం విడుదలై భారీ విజయం సాధిస్తే మరెన్ని రికార్డులు బద్దలు అవుతాయో? అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ చిత్రం తమిళ నూతన సంవత్సరం కానుకగా ఏప్రిల్ 14న విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో విజయ్ మూడు విభిన్న గెటప్‌లలో కనిపిస్తున్నాడు. జోసఫ్, విజయ్‌కుమార్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇవ్వన్నీ ఒక్క పాత్ర వేసిన వివిధ గెటప్సా? లేక ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. కాగా టాలీవుడ్‌లో ఇప్పటికే జనవరి 1నుంచి పలు పెద్ద పెద్ద స్టార్స్ విడుదలయ్యాయి.
కానీ తమిళంలో ఈ నూతన ఏడాదిలో ఇప్పటివరకు ఏ స్టార్ హీరో సినిమా విడుదల కాలేదు. అలా విడుదలవుతున్న మొదటి చిత్రం 'తేరీ' కావడం విశేషం. తమిళంలో ఇప్పటివరకు ఈ ఏడాదిలో విశాల్ 'కథకళి' తో పాటు 'రజనీ మురుగన్, సేతుపతి' చిత్రాలు మంచి విజయమే సాధించినప్పటికీ ఇవన్నీ చిన్న, మీడియం రేంజ్ హీరోల నుండి వచ్చిన చిత్రాలే కావడం గమనార్హం. కాగా 'తేరీ' చిత్రం ఆడియో కూడా ఇటీవల విడుదలైంది. ఇందులో హీరోగా నటించిన విజయ్ అందరితో చాలా సింపుల్‌గా ఉంటాడు. మీడియాతో కూడా ఎంతో గౌరవంగా ఉంటాడు. ఎలాంటి ఇగోలకు పోకుండా ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే క్షమాపణ చెప్పి, ఆ పొరపాటును ఒప్పుకునే తత్వం ఆయనది. అందుకే ఆయనంటే అందరికీ ఎంతో గౌరవం. తాజాగా ఆయన 'తేరీ' ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడుతూ చైనా కమ్యూనిస్ట్ నేత మావోని రష్యన్ లీడర్‌గా పేర్కొన్నాడు. దీంతో ఈ అంశం మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. కానీ తన తప్పును గమనించి వెంటనే మీడియా మిత్రులందరినీ పిలిచి క్షమించాలని కోరాడు. కాగా ఈ చిత్రం మొత్తం నిన్నటితరం హీరోయిన్ మీనా కూతురైన నాలుగేళ్ల నైనిక చుట్టూనే తిరుగుతుందిట. ఈ చిత్రంలో ఆ పాప విజయ్ కూతురిగా నటించనుందని సమాచరం. దాదాపు 40సీన్లలో ఆ పాప కనిపిస్తుందని, ఆమె నటన హృదయాలకు హత్తుకొనేలా ఉంటుందని స్వయాన మీనాయే ఒక ఇంటర్వ్యూలో ఇటీవల స్వయంగా తెలిపింది.