ఇటీవల సోలోహీరోగా నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం 50కోట్లకు పైగా వసూలు చేసి తన సత్తా చాటింది. అయినా కూడా నాగ్ మాత్రం ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకునే నాగ్ ఇకపై సోలోహీరోగా సినిమాలు తగ్గించి మల్టీస్టారర్స్‌పై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చాడట. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'ఊపిరి' చిత్రంలో నాగ్ కార్తీతో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మొదట కార్తి పాత్రను ఎన్టీఆర్ చేత చేయించాలని భావించినప్పటికీ అది వివిధ కారణాల వల్ల వర్కౌట్ కాలేదు. ఈ గ్రీకువీరుడు మాత్రం నాకు తోడుకావాలంటున్నాడు. త్వరలో ఆయన బన్నీతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా నాగ్ త్వరలో తమిళ స్టార్ సూర్యతో కూడా కలిసి నటించే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ సమాచారం. మొత్తానికి నాగ్ తన బావ వెంకటేష్ నడుస్తున్న దారిలోనే నడవాలనే నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఇలాంటి మల్టీస్టారర్స్‌కు ఇటీవల తెలుగులో శ్రీకారం చుట్టిన ఘనత వెంకీకే దక్కుతుంది. ఆయన ఇప్పటికే మహేష్‌బాబు, రామ్, పవన్‌కళ్యాణ్ వంటి హీరోలతో కలిసి నటించాడు. మొత్తానికి 'సోగ్గాడే చిన్నినాయనా' అనే ఒక్క చిత్రాన్ని ఉదాహరణగా తీసుకొని కేవలం సోలో హీరోగానే నటించాలనే ఆలోచన చేయకుండా ప్రాక్టికల్‌గా నాగ్ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిందని అంటున్నారు.