పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ దృష్టిలో పడ్డాక ఇక ఎవరైనా ప్రశాంతంగా ఉండగలరా? అసలే ఆయనకి తెలుగు రాష్ట్రాల్లో పిచ్చ ఫ్యాన్ ఫ్యాలోయింగ్ ఉంది. కనుసైగతోనే కోట్లమందిని కదిలించగల సత్తా పవన్‌కి ఉంది. ముఖ్యంగా యువతరం పవన్‌పై ఈగ వాలనివ్వదు. తమ హీరోని ఎవరైనా కించపరిచినట్టు అనిపిస్తే ఇక వాళ్ల సంగతి తేల్చేదాకా వదిలిపెట్టరు. అది తెలియదో ఏంటో మరి! బాలీవుడ్‌కి చెందిన విమర్శకుడు కమల్ ఖాన్ పవన్‌తో పెట్టుకున్నాడు. ఇటీవల సర్దార్ గబ్బర్‌సింగ్ పోస్టర్లని చూసి పవన్ కళ్యాణ్ ఓ జోకర్ అని కామెంట్ చేశాడు. 'పవన్ సినిమాల్ని నేనస్సలు చూడను. కార్టూన్ ఫేసుల్ని సౌతిండియావాళ్లు ఎలా చూస్తారో అర్థం కావడం లేదు. వాళ్లది మరీ బ్యాడ్ చాయిస్. పవన్‌లాంటోడు స్టార్ అయితే ఇక ఎవరైనా స్టార్ కావొచ్చు' అంటూ నోటికొచ్చిందల్లా ట్విట్టర్‌లో కూసేశాడు. దీంతో పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది. ఆ కామెంట్లు రావడం మొదలు... ట్విట్టర్‌లోనే ఏకేస్తున్నారు. ఆ వాయింపుడుని భరించలేని కమల్‌ఖాన్ మళ్లీ ట్విట్టర్‌లోకి వచ్చి 'పవన్‌కళ్యాణ్ అంటే ఎవరో కూడా నాకు తెలియదు. తొలిసారి ఆ పేరు వింటున్నా. నన్నెందుకు డిస్ట్రబ్ చేస్తున్నారు' అంటూ కామెంట్ చేశాడు. దీన్నిబట్టి కమల్ ఎంతగా డిస్ట్రబ్ అయ్యుంటాడో ఊహించొచ్చు. అయినా సరే వెనక్కి తగ్గలేదు అతను. మళ్లీ పవన్‌కళ్యాణ్‌తో నటించడానికి సన్నీ లియోన్ ఒప్పుకుంటుందంటారా? అని పోల్ పెట్టేశాడు. అతని కామెంట్లు ఇలాగే కొనసాగితే మాత్రం పవన్ ఫ్యాన్స్ మరింత డిస్టర్బ్ చేయడం ఖాయం.