అక్కినేని వంశ వారసుడు నాగచైతన్య కెరీర్‌ను చూస్తే ఆయన తమిళ దర్శకులు, ఇతర భాషల రీమేక్‌లపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు అర్ధం అవుతోంది. మన దర్శకులు, వారి కథలపై నమ్మకం లేకపోవడంతోనే ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడా? అనే అనుమానం కలుగుతుంది. నిరంతరం ఆయన తమిళం, మలయాళంలలో వస్తున్న సినిమాల అప్‌డేట్స్ తెలుసుకుంటున్నాడట..! తెలుగు స్టార్ డైరెక్టర్స్ ఆయనతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడం, ఒక హిట్ కొట్టిన దర్శకులతో ముందుకెళ్తే 'ఒక లైలా కోసం', 'దోచెయ్' లాంటి చిత్రాలతో తన కెరీర్‌నే దెబ్బకొట్టడం చైతూ నిర్ణయానికి కారణంగా చెప్పుకోవచ్చు. వరస ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు ఎవరికైనా అదే అనిపిస్తుంది. తండ్రికి తెలుగు డైరెక్టర్ కళ్యాణకృష్ణ తెలుగుదనం ఉన్న కథతోనే హిట్ కొట్టిన విషయాన్ని మర్చిపోతున్నాడు. తన తండ్రి మాట తీసేయలేకనే ఆయన కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడని అంటున్నారు. తన మొదటి సినిమానే దర్శకుడు వాసువర్మ తన సొంత కథతో చేసిన 'జోష్' చిత్రం నుండి 'ఆటోనగర్‌సూర్య, ఒక లైలా కోసం, దోచెయ్' వంటి ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు. తన కెరీర్‌కు మొదటి హిట్‌ను తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ తీసిన 'ఏమాయ చేసావే' చిత్రంతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'తడాఖా' సినిమా హిట్ అయింది. అది కూడా ఓ తమిళ రీమేక్ కావడం గమనార్హం. ఆయన కెరీర్‌లో అచ్చమైన తెలుగు దర్శకుడు సుకుమార్ తన సొంత కధతో తీసిన '100%లవ్' ఒక్కటే హిట్. ప్రస్తుతం ఆయన రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి తమిళ డైరెక్టర్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తీస్తున్న 'సాహసం శ్వాసగా సాగిపో' కాగా, రెండోది మలయాళ రీమేక్ 'ప్రేమమ్' కావడం విశేషం. కాగా త్వరలో ఆయన మరో తమిళ దర్శకుడు సెల్వరాఘవన్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కాగా 'ప్రేమమ్' చిత్రం జులై 6న విడుదల కానుందని సమాచారం.