ఇంతదాకా సినిమాను రాజకీయానికి వాడుకున్నా, రాజకీయాన్ని సినిమాకు వాడుకున్నా అది కేవలం నందమూరి వంశానికే హెచ్చుగా చెల్లింది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్, తారకరత్న... ఇలా నందమూరి నట వారసులంతా తండ్రి, తాత పేరు చెప్పుకుని బాగా ఎదిగిపోయారు. కానీ లెజెండ్ ఎన్టీయార్ తరువాత ఆయన రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకుని ముఖ్యమంత్రిగా మారిన నారా చంద్రబాబు నాయుడు పేరుని వాడుకున్నోళ్ళు సినిమాలలో ఎవరూ లేరు. అందుకే మా పెదనాన్న అంటూ నారా రోహిత్ కొత్తగా తుంటరితో వచ్చాడు. ఈ మూవీలోని కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ఇంట్రడక్షన్ పాటలో తెలుగు దేశం పార్టీ పచ్చ రంగును స్క్రీన్ మొత్తం పులిమేసారు. నాయుడు కట్ అవుట్ కూడా కమర్షియల్ పంథాలో వాడుకోవడం ఇక్కడ మొదటిసారనే చెప్పాలి. ఓ సీన్లో అయితే రోహిత్ వారి రాజకీయ ప్రత్యర్ధులైన జగన్, YSRలను అనుకరిస్తూ చేసిన కామెడీ పొలిటికల్ సెటైర్ అనాల్సిందే. అటు నారా అభిమానులు, ఇటు నందమూరి ఫ్యాన్స్ గనక రోహిత్ మనాడే అనుకుంటే తుంటరి నుండి మొదలు రేపు రాబోయే సావిత్రి, రాజా చెయ్యి వేస్తే లాంటి చిత్రాలతో రోహిత్ దశ తిరగొచ్చు. దీనికి రోహిత్ శారీరక శ్రమ కూడా తోడయితే ఇంకొంచెం బెటర్.