సంగీత దర్శకుడిగానే కాక సినిమా దర్శకుడిగా, నటుడిగా కూడా ఆర్పీ పట్నాయక్ అంటే మనకు ఎనలేని అభిమానం. మారుతున్న మార్కెట్ డిమాండ్స్ దృష్ట్యా ఈ మధ్య ఆర్పీ పేరు మరుగునపడి పోయినా ఆయన స్వరపరిచిన పాటలు మాత్రం ఇంకా మన మనస్సులలో పదిలంగానే ఉన్నాయి. కానీ అదేంటో ఆర్పీ గారు మాత్రం తన పేరును తానే తగ్గించి చూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న విడుదలైన తులసీదళం ద్వారా అనిపించింది. హారర్-థ్రిల్లర్లు ప్రస్తుతానికి తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేస్తున్న తరుణంలో తులసీదళం అన్న ఓ కల్ట్ టైటిల్ పెట్టుకుని ఎంత మంచి సినిమా తీసాడేమో అని ఆత్రుతుగా ధియేటర్లకు చేరిన జనాన్ని నిజంగానే ఆర్పీ గారు తన దర్శకత్వం, నటనతో భయపెట్టి పంపారు. హారర్ చిత్రాన్ని రీ-డిఫైన్ చేసేలా ఒక్క భయపెట్టే ఎపిసోడ్ కూడా లేకుండా, అత్యంత భయంకరమైన సినిమా చూపించాడు. పైగా ఇంతోటి సినిమాకి ఆయనే నిర్మాత కావడం మరింత పీనాసి తనానికి కారణమయి అమెరికాలోని లాస్ వేగాస్ పట్టణంలో షూటింగ్ మొత్తం చేసినా కన్ను ఆర్పకుండా చూసే ఒక్క దృశ్య సౌందర్యం లేకపోవడం బాధాకరం. అమెరికా ట్రిప్పుకు వీసా వస్తే ఏదో సరదాగా తీసుకున్న ఫుటేజీలా ఉందే తప్ప తులసీదళం ఏ కోణంలో చూసినా ఓ సినిమా అనడానికి పూర్తిగా అనర్హం.