సౌత్‌ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ 'కొచ్చాడయాన్, లింగా' చిత్రాలతో ఓ మంచి గుణపాఠం నేర్చుకున్నాడు. ముఖ్యంగా 'లింగా' చిత్రాన్ని ఎన్నో రెట్లు లాభానికి, రజనీ బొమ్మను చేసి అమ్ముకున్నాడు నిర్మాత వెంకటేష్. కానీ ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయి నిర్మాతను తన లాభం కొంత తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. కానీ నిర్మాత మాత్రం పైసా తిరిగి ఇచ్చేది లేదని భీష్మించుకొని కూర్చొవడంతో బయ్యర్లు అనవసరంగా రజనీని అవమానించే పనులు చేశారు. ఎట్టకేలకు ఆయా బయ్యర్లకు వచ్చిన నష్టాన్ని కొంత సొంతంగా రజనీయే భరించాడు. దీంతో ఇప్పుడు ఆయన తన తాజా చిత్రం 'కబాలి' విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వరుసగా రెండు డిజాస్టర్స్ వచ్చినప్పటికీ ఈ చిత్రానికి కూడా ప్రీరిలీజ్ బిజినెస్ ఆఫర్లు భారీగా వస్తున్నాయి. కాగా ఈ చిత్రం నిర్మాత కలైపులి థానుకు రజనీ ముందస్తు హెచ్చరికలు చేశాడు. ఈ చిత్రం బడ్జెట్ కేవలం 75కోట్లు మాత్రమే కాబట్టి మరీ ఎక్కువ రేట్లకు అమ్మవద్దని, మినిమం లాభాలకు మాత్రమే అమ్మాలనేది ఆయన కండీషన్. ఈ విషయంలో ఆయన బయ్యర్లకు కూడా మరీ ఎక్కువ మొత్తానికి రైట్స్ కోనవద్దని సూచన ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి ఈ విషయంలో రజనీ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ, తన బిజినెస్ రేంజ్‌ను తానే తగ్గించుకుంటుండటం ఇప్పుడు కోలీవుడ్ సర్కిళ్లలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం దిల్‌రాజు, ఎన్వీప్రసాద్, బండ్ల గణేష్, సి.కళ్యాణ్ తదితరులు పోటీపడుతున్నారు. రజనీ నిర్ణయంతో తెలుగు వెర్షన్ రేటును కూడా బాగా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం.