నిన్నటితరం హీరోలైన సుమన్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాలు, విలన్ పాత్రలు... ఇలా అన్నింటికి ఓకే చెబుతున్నారు. ఈ కోవలోకి ఒకప్పుడు యాంగ్రీ యంగ్‌మేన్‌గా, ముఖ్యంగా పోలీస్ పాత్రల్లో నటించి, సాయికుమార్ వాయిస్‌తో దూసుకుపోయిన హీరో రాజశేఖర్ కూడా చెందుతాడు. కానీ ఈమధ్యకాలంలో ఈ హీరో గారికి హిట్లు కాదు కదా..! అవకాశాలే లేవు. తాజాగా రాజశేఖర్ విలన్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అయి పై జాబితాలోని నటుల్లో చేరిపోయాడు. తేజ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న 'అహం' చిత్రంలో రాజశేఖర్ మెయిన్ విలన్ క్యారెక్టర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీహరి తర్వాత ఆ స్థాయిలో పాత్రలు చేయదగ్గ సత్తా కేవలం తనకే ఉందనే మితిమీరిన ఉత్సాహంతో ఆయన అనేక మంది నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడట. హీరోల కంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తూ, తాను చెప్పిన దానికి పైసా తక్కువైనా చేసేది లేదని ఖరాఖండీగా చెబుతుండటంతో రాజశేఖర్ కోసం వెళ్లిన దర్శకనిర్మాతలు ఆయన డిమాండ్ చేస్తున్న పారితోషికం చూసి వెనక్కి తిరిగివచ్చేస్తున్నారట. హీరోగా కూడా అవకాశాలు లేని సమయంలో రాజశేఖర్..తన దగ్గరకు హీరో పాత్రలు తెచ్చిన వారిని కూడా ఇలాగే డిమాండ్ చేస్తూపోవడంతో ఆ హీరో అవకాశాలు కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తాజాగా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి కూడా మరలా అదే తరహాలో భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న ఆయన తీరును చూస్తే.. రాజశేఖర్ పాతరూట్‌లోనే వెళుతున్నాడని, ఇప్పటికీ ఆయన నేచర్ మారలేదని ఫిల్మ్‌నగర్ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.