సాయి ధరం తేజకు అన్నీ అలా కలిసి వస్తున్నాయి మరి. మెగా అభిమానుల అండదండలు ఎలాగో ఉన్నాయి కాబట్టి సరైన సినిమా పడితే స్టార్, మాస్ ఇమేజి సొంతం చేసుకోవడం పెద్ద పనేమీ కాకపోవచ్చు. కాకపోతే ఆ సరైన సినిమా పడేవరకే ఈ కష్టాలన్నీ. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితంలతో పిల్లాడిలో విషయం ఉందన్న విషయాన్ని జనాలయితే గ్రహించారు. అందుకే ఇప్పుడు సుప్రీం సినిమాతో ఇక స్టార్ డం సొంతం చేసుకోవాలన్న ఆరాటం ఎక్కువైంది. దీనికి నిర్మాత దిల్ రాజు, దర్శకుడు అనీల్ రావిపూడి తోడవడం మరో అదృష్టం. ఏప్రిల్ 1న సుప్రీం రిలీజని రాజుగారు ముందే ప్రకటించారు. అయితే 1న సుప్రీం వస్తే, ఇంతకుమునుపు అనుకున్నట్లు ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ అటు తరువాత అల్లు అర్జున్ సరైనోడు కూడా వరసపెట్టి ఏప్రిల్ నెలలోనే క్యూ కట్టాయి. అదృష్టం ఎంతలా ఉండకపోతే మరి, ఇప్పుడు అన్ని తారీఖులు తారుమారయ్యాయి. అందరు మాట, తారీఖులు మార్చినా సుప్రీం గనక ఏప్రిల్ 1 నాటికే అతుక్కుపోతే ఏప్రిల్ 22 వరకు అంటే సరైనోడు వచ్చేవరకు మెగా అభిమానులకు ఈ మూవీ ఒక్కటే దిక్కు. వీటికి తోడు చిత్రం పాజిటివ్ టాక్ గనక సొంతం చేసుకుంటే సుప్రీం టైటిల్ ఆ మామకు తగ్గ మేనల్లుడిలా సార్థకనామధేయుడు అవొచ్చు.