1950 కంటే ముందు వచ్చిన తెలుగు సినిమాల్లో నటించే హీరోలు, హీరోయిన్లు మల్టీ టాలెంటెడ్ అనే విషయం మనకు తెలుసు. హీరోలు.. ముఖ్యంగా హీరోయిన్లు తమ సినిమాల్లో పాటలు తామే పాడుకునే వారు. రంగస్థలం నుంచి వచ్చిన వారు కావడంతో పాటల్ని అవలీలగా పాడేస్తూ సింగర్స్ అవసరం లేకుండా చేసేవారు. ఎస్.వరలక్ష్మి, నాగయ్య, భానుమతి వంటి నటీనటులు వారి పాటలను వారే ఆలపించేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ నేపథ్యగాయకుల ప్రాముఖ్యత పెరిగింది. చాలా కాలం నటీనటులు పాటల జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు వస్తున్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈమధ్య హీరోలు, హీరోయిన్లు తమ సినిమాల్లోని పాటల్ని పాడేస్తూ సింగర్స్‌ని మరపిస్తున్నారు.
ఈమధ్యకాలంలో తెలుగులో పాటలు పాడడానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అనే చెప్పాలి. తన ప్రతి సినిమాలో ఏదో ఒక పాట పాడి అభిమానుల్ని అలరిస్తున్నాడు. అలాగే రవితేజ కూడా పాటలు పాడడం మొదలుపెట్టాడు. లేటెస్ట్‌గా నారా రోహిత్ కూడా పాట పాడాడు. ఆమధ్య నిత్యమీనన్ అలా మొదలైంది చిత్రంలో పాటలు పాడి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు హీరోయిన్ త్రిష వంతు వచ్చింది. తన లేటెస్ట్ మూవీ నాయకి చిత్రం కోసం రఘు కుంచె సంగీత సారధ్యంలో ఓ పాట పాడింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న నాయకి తెలుగు వెర్షన్ కోసం త్రిష ఈ పాట పాడింది. టాలీవుడ్‌లో ఎంటర్ అయి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకోని త్రిష ఇప్పుడు పాట పాడేసింది. ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పే ఆలోచన త్రిష వున్నట్టు తెలుస్తోంది.