ఒక వైపు యావత్ భారతదేశంలోని మీడియా నందమూరి బాలకృష్ణ చేసిన కొంటె పనికి ఉతికి ఆరేస్తుంటే ఇప్పుడే ఆయన వందో సినిమా గురించి కొత్త సమాచారం అందింది. చాన్నాళ్ళ నుండి ఈ సినిమా పట్ల అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం కనపడుతున్నా బాలయ్య బాబు మాత్రం బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాస్ రావు, కృష్ణ వంశీ లాంటి మరో రెండు మూడు దర్శకుల పేర్లతో సతమతం అవుతున్నారు. తాజా న్యూస్ ప్రకారం రానున్న అమావాస్య దాటిన తరువాతే బాలకృష్ణ 100వ ప్రాజెక్టు పట్ల ఓ నిర్ణయానికి రానున్నారని, అంతవరకు అందరి నుండి కథలు వినేందుకు సిద్ధమని తెలుస్తోంది. క్రిష్ కథలోని శాతవహానుల అంశం, అమరావతిని స్థాపించిన గౌతమి పుత్ర శాతకర్ణి పాత్ర బాలయ్యకు బాగా నచ్చాయని, ఇక కృష్ణవంశీ చెప్పిన దానిలో రైతుకు సంబంధించి బ్రహ్మాండమైన పాయింట్ ఉందని కూడా చెబుతున్నారు. అలాగే సింగీతం గారి ఆదిత్య 369 రెండో భాగం ద్వారానే వచ్చే ఏడాది నందమూరి మోక్షజ్ఞ్య ఎంట్రీ ఉండబోతోంది అని కూడా తెలుస్తోంది. అటు నట సింహం 100వ చిత్రం, ఇటు మోక్ష 1వ చిత్రం మొత్తానికి ఒకే ఏడాదిలో అవకాశాలున్నాయి.